చైనా మాంద్యంలో ఇండియా లాభాలు! 


పెట్టుబడులను ఆహ్వానించడానికి భారత్ నాయకులు చైనా వెళ్ళడం అవసరం…మౌలిక వసతుల కల్పనకు మితి మీరి ఖర్చు చేయడమే చైనా ఆర్ధిక సంక్షోభానికి మూలమని నరేంద్రమోదీ, చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు గ్రహించడం కూడా మన ప్రయోజనాలకు అత్యవసరం.

http://www.telugu360.com/te/surat-diamond-blow-to-china-even-more-benefits-to-india/ 

  

రెండు రాషా్ట్రల సగటు మనిషిదీ ఒకటే హృదయం


రెండు రాషా్ట్రల సగటు మనిషిదీ ఒకటే హృదయం

(శనివారం నవీనమ్)
తన జీవితంలో ఎన్నో అంశాలను పరిశీలించి, పరిష్కరించానని, అయితే మనం దేశ,విదేశాల్లో ఎవరితో మిత్రుత్వం, శత్రుత్వం చేయాలో నిర్ణయించుకోవచ్చుగానీ, మన పక్కన వుండే వారిని నిర్ణయించుకోలేమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. కాబట్టి ఇష్టం ఉన్నా లేకున్నా…కలిసి బ్రతకాల్సిందేనని, అందరూ కలిసి దేశాభివద్ధికి దోహదం చేయాల్సిందేనని అదే చరిత్ర చెప్పిన పాఠమని నిన్న హైదరాబాద్ లో ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన చేసిన వ్యాఖ్యానాలు చంద్రబాబునాయుడు, కెసిఆర్ ప్రభుత్వాలను ”చెంపలు వాయించుకుని గుంజీలు తీయాలని” పెద్దమనిషి ప్రేమతో మందలించినట్టుగా వున్నాయి. 
కెసిఆర్ ఆంధ్రానాయకుల్ని లత్కోర్లు, లఫంగీలు అని హేళన చేసినా…నన్ను టచ్ చేస్తే తెలంగాణా ప్రభుత్వానిక అదే ఆఖరురోజని చంద్రబాబు ఊగిపోయినా ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణా ప్రజలుగాని ఆవేశాలతో రెచ్చిపోలేదు. టిఆర్ఎస్, తెలుగుదేశం పార్టీలు వాటివాటి వైరాల్ని, గొడవల్ని ప్రజలకు పులిమే ప్రయత్నాలు చేస్తున్నా వాటిని అంటించుకోని రెండు రాషా్ట్రల ప్రజల సామరస్యం, వివేకం, ఇంగితం తెలుగురాషా్ట్రల్లో సగటు మనిషి కొండంత ఎత్తున నిలిపివుంచింది.ఇదే స్పూర్తిని రాష్ట్రపతి మాటల్లోకి మార్చారా అనిపిస్తోంది.
హైదరాబాదు తెలంగాణలో భాగంగా రాజధానిగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని నిర్మాణం జరిగే లోగా పదేళ్లకు మించకుండా హైదరాబాదు నుంచే పాలన సాగించాలి గనక ఉత్పన్నమైన ప్రత్యేక నిబంధనల అధ్యాయమే సెక్షన్ 8 . రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాల ప్రకారమే నడుచుకోవాలి. తెలంగాణ ప్రభుత్వానికీ అదే సూత్రం వర్తిస్తుంది. హైదరాబాద్లో ఆంధ్రప్రదేశా పరభుత్వం కూడా నివాసముంటోంది.దీనిపై మరో రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ చేసే అవకాశముండదు. కనుక మధ్యంతర దశలో గవర్నర్‌కు కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగించడమే ఆ సెక్షన్‌ ఉద్దేశం. ఆ ప్రకారం గవర్నర్‌ …భవనాల కేటాయింపు…పౌరుల, ప్రధాన సంస్థల భద్రతకు సంబంధించి పర్యవేక్షణ చేయవలసి ఉంటుంది. ఇందుకోసం కేంద్రం ఆయనకు ఇద్దరు సలహాదార్లను నియమి స్తుంది. తెలంగాణ మంత్రివర్గంతో సంప్రదిస్తూ దాని సలహాల మేరకు గవర్నర్‌ పనిచేస్తారు. అయితే ఎప్పుడైనా ఆయన గనక ఆ ప్రభుత్వ నిర్ణయాలతో విభేదిస్తే అప్పుడు ఆయన విచక్షణాధికారమే అంతిమమవుతుంది.
ఈ సెక్షన్‌ ఇప్పటి వరకూ అమలు జరిగిందా, లేదా అంటే ఏదో మేరకు అమలు జరుగుతూనే ఉంది. భవనాల కేటాయింపు, వాహనాల కేటాయింపు వంటివి ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి. ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులే గాక మంత్రులూ, ముఖ్యమంత్రులూ కూడా ఆయనతో తరచూ సమావేశమవుతున్నారు. నాగార్జున సాగర్‌ డ్యాంపై పోలీసుల ఘర్షణ, ఎన్జీవోల కార్యాలయంలో ఘర్షణ వంటివి జరిగినప్పుడు ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడారు. ముఖ్యమంత్రులతో నూ సంప్రదించారు. విద్యా సంబంధ మైన విషయాల పైనా ఇరు రాష్ట్రాల మంత్రులూ ఆయనతో సమావేశమై అవగాహనకు వచ్చారు. ఇవన్నీ స్థూలం గా సెక్షన్‌ 8 పరిధిలోవే.

కాకపోతే అమలు కాని అంశం ఒకటుంది. ఈ సెక్షన్‌ అమలుకు నిబంధనల పేరిట కేంద్రం ఒక లేఖ రాసింది. అందులో పోలీసు కమిషనర్ల నియామకం వంటివి కూడా గవర్నర్‌ సలహాల మేరకు జరగాలన్నట్టు పేర్కొంది. దానిపై తెలంగాణ అభ్యంతరం తెల్పడంతో పక్కన పెట్టారు. దాన్ని ఉపసంహరించాలని ఆ ప్రభుత్వం గాని అమలు చేయాలని ఎపి ప్రభుత్వం గాని ఎప్పుడూ గట్టిగా అడిగింది లేదు. ఇప్పుడు రాజకీయ ఇరకాటంలో చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు దీన్ని పైకి తీశారు. తమ ప్రభుత్వాధినేతకే రక్షణ లేదు గనక స్వంత రాష్ట్ర పోలీసులను తెచ్చుకుంటామనీ, సరిగ్గా వారిపై ప్రతి వ్యూహ ప్రయోగం కోసం కెసిఆర్‌ ఆయన అనుయాయులు అసలా ఊసే ఒప్పుకోబోమని వాదించారు. 
చెప్పాలంటే ఇదంతా కృత్రిమమైన వ్యవహారం. పైగా ఈ క్రమంలో హైదరాబాదు శాంతిభద్రతలు పదే పదే చర్చకు రావడం రెండు రాష్ట్రాలకూ మంచిది కాదు. చంద్రబాబు నాయుడు ఢిల్లీలో సమర్పించిన ఒక పత్రంలో దాడులు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. కొన్ని రకాలైన ఒత్తిళ్లు, అపార్థాలు ఉన్నా ప్రభుత్వ స్థాయిలో ఫిర్యాదు చేయాల్సినంత తీవ్ర పరిస్థితి హైదరాబాదులో లేదనేది వాస్తవం. 
ప్రధానంగా ఉద్యోగ కేంద్రాలలోనూ, అధికారుల బదలాయింపులోనూ, విద్యా సంస్థల పరీక్షలు, సీట్ల కేటాయింపులలోనూ, నీటి పంపిణీ లోనూ వివాదాలు వచ్చిన మాట, కొనసాగుతున్న మాట కాదనలేనిది. అయితే ఇందుకు బాధ్యత ప్రభుత్వాలది తప్ప ప్రజలది కాదు. వారి మధ్య ఘర్షణలు వచ్చిందీ లేదు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పారిశ్రామికవేత్తల సదస్సుకు ఆంధ్రప్రదేశ్‌ హేమా హేమీలంతా వచ్చారు. అమరావతి నిర్మాణంలో భాగం కోసం తెలంగాణకు చెందిన సంస్థలూ ఉవ్విళ్లూరుతున్నాయి. ఎటొచ్చి తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ల రాజకీయ వైరమే పరిస్థితిని ఉద్రిక్తం చేసింది. 

గ్రేటర్‌ హైదరాబాదు ఎన్నికల కోణంలో ఉన్న టిఆర్‌ఎస్‌ కూడా అందుకు తగినట్టే స్పందించింది. సెక్షన్‌ 8ని గుర్తిస్తాము గాని దాన్ని అమలు చేయాల్సిన పరిస్థితులు లేవని తెలంగాణ సర్కారు అంటుంది. ఆ పరిస్థితులు ఉన్నాయా, లేదా అని నిర్ణయించు కోవలసింది గవర్నరే. ఇక ఎపి విషయానికి వస్తే ఈ సెక్షన్‌లో దాని ప్రస్తావనే లేదు. 
గవర్నర్‌ సంప్రదించాల్సింది తెలంగాణ సర్కారును తప్ప ఎపిని కాదు. కాకపోతే ఏమైనా ఫిర్యాదులు, విజ్ఞప్తులు ఉంటే స్వీకరించి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది.
అతి సామాన్య ప్రజలకు ఈ వివరాలన్నీ తెలిసి వుండకపోవచ్చు. అయితే ఏవివాదంలోనైనా, ఏ కీలకాంశంలోనైనా ప్రజల ప్రయోజనాలు ఎంత, పార్టీల లాభమెంత అని బేరీజువేసుకునే ఇంగితజ్ఞానం వున్న తెలుగు మనిషీ వర్ధిల్లు !

కెసిఆర్ దూకుడు – సెక్షన్ 8 అడ్డుకట్ట! (శనివారం నవీనమ్)


ఓటుకినోటు కేసులో న్యూస్ టివిల బ్రేకింగ్ న్యూస్ లు ఆగిపోయాయి. తెలంగాణా పాలకపక్షమైన టిఆర్ఎస్ నుంచి మీడియాకు లీకులు ఆగిపోవడమే ఇందుకుమూలం. తెలుగుదేశం అధినేత పట్ల చర్యతీసుకునే విషయంలో టిఆర్ఎస్ అధిష్టానం ఆలోచనలు మారుతున్నాయనే ఈ పరిణామాల్ని అర్ధం చేసుకోవాలి.

ప్రతియాక్షన్ కీ రియాక్షన్ వుంటుందన్న సూత్రం భౌతికశాస్త్రం లో ప్రత్యక్షంగా కనిపించదేమోకాని రాజకీయశాస్త్రంలో అడుగడుగునా ఎదురౌతూనే వుంటుంది.
ఉద్యమకాలం నుంచీ కూడా ఆంధ్రోళ్ళపార్టీ అనిప్రచారంచేస్తూ తెలంగాణా ప్రజల్లో తెలుగుదేశం మీద ఈసడింపు, ద్వేష భావాలను టిఆర్ఎస్ నూరిపోసింది. చంద్రబాబుకి ఏమాత్రమూ రాజకీయ అవకాశాన్ని మిగల్చకూడదన్న దిశగానే కెసిఆర్ మొదటినుంచీ వ్యవహరిస్తున్నారు. ఇందుకు లభించిన ఏ అవకాశాన్నీ ఆయన ఎన్నడూ వొదులుకోలేదు. యాభైలక్షల అడ్వాన్సు ఇచ్చిన వలలో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. తరువాత పరిణామాలు రెండు రాషా్ట్రల్లోనూ ఉద్విగ్న భరితమైన వాతావరణం ఏర్పడింది. వేడిచల్లారే కొద్దీ న్యాయమీమాంసలు తలఎత్తడం మొదలైంది.
లేని ఉద్దేశాన్ని ప్రేరేపించి నేరానికి పాల్పడేలా ఉచ్చులోకి లాగే స్టింగ్ ఆపరేషన్ న్యూస్ టివిల సంచలనాలకు సరే! ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకు కూడానా?
ఇది చట్టబద్దమేనా? అయితే ఇలాగే సిబిఐ స్టింగ్ ఆపరేషన్ లో దొరికిన కేంద్రమంత్రి దిలీప్ సింగ్ జుదేవో కేసును 2003 లో సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేసింది?
మరి ఎబిసి పని టా్రప్ లోకి లాగేసి పట్టుకోవడమే కదా? అయితే ఏరాష్ట్రముఖ్యమంత్రి మీదైనా ఒక రాష్ట్రపు ఎబిసి వలపన్న వచ్చునా? రేవంత్ రెడ్డి అనే ప్రొటోకాల్ లేని వ్యక్తిమీద విసిరిన వల ఆధారంగా ముందుకి సాగిపోయినపుడు అనుకోకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అందులో తగులుకున్నారా ?
ఏంజరిగిందో అందరికీ తెలుసు…కెసిఆర్ రాజకీయ ఉద్దేశాలతోనే వల వేశారు. చంద్రబాబు అందులో చిక్కుకున్నారు..బాబుకి దేశవ్యాప్తంగా పెద్ద డామేజీ జరిగింది. అయితే చట్టపరమైన సాంకేతిక అంశాలను బట్టే కేసునుంచి బయటికి రావడమో, ఇరుక్కుపోవడమో వుంటుంది.
చంద్రబాబుకి జరిగిన డామేజి మేరకు కెసిఆర్ కి సొంతరాష్ట్రంలోగాని దేశవ్యాప్తంగా కాని అదనపు ప్రతిష్టపెరగలేదు. బాహాటంగా మద్దతు ఇవ్వలేకపోయినా కెసిఆర్ సహా అందరూ చేస్తున్న ”కొనుగోళ్ళే” గనుక రాజకీయవర్గాల్లో బాబు పట్ల సానుభూతి పెరిగింది.
అయితే ఆంధ్రులమీద ఇప్పటికే తెలంగాణాలో విజయవంతంగా నూరిపోసిన ద్వేషం మరోసారి ఆ ప్రాంతంలో ఉద్వేగపూరితమైన విజయంలా పరిణమించింది. దానికి రియాక్షన్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉక్రోషపూరితమైన ఉద్వేగంగా మారింది.
అయితే దీనినుంచి తెలుగుదేశం తేరుకుంది. ఫోన్ టాపింగ్ లో అడ్డంగా దొరికపోయున తెలంగాణా ప్రభుత్వంలో బాధ్యుల్ని కేంద్రంముందు నిలబెట్టదలచారు. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ లో శాంతిభద్రతల అదుపు అధికారాలు గవర్నర్ కి అప్పగించాలన్న 8 వ సెక్షన్ అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు.
హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతుల్లోకి వెళ్ళిపోయి ఉత్సవమూర్తిగా మిగిలిపోవడం కెసిఆర్ కే కాదు ఏ ముఖ్యమంత్రికీ ఇష్టం వుండదు. ఇందువల్లే ఈ కేసులో ”తనపని తానే చేసుకుపోయే చట్టం” దూకుడు తగ్గించిందని అర్ధమౌతూంది.
రాజకీయాల్లో ఆధిపత్యాల సాధనకు రాజకీయప్రక్రియలనే అనుసరించడం క్రీడాధర్మం…కెసిఆర్ ఆటను మార్చారు…అవినీతిని బయటపెట్టడానిక అధికారాన్ని చట్టాన్నీ వాడారు. ఆయన అవినీతి మచ్చేలేని గాంధీజీ అయివుంటే, అన్నాహజారే అయివుంటే రేవంత్ రెడ్డిని రెడ్ హాండెడ్ గా పట్టుకున్నందుకు ఆయన ప్రభుత్వం కీర్తప్రతిష్డలు ఉవ్వెత్తున ఎగిసివుండేవి. అయితే ఈ వ్యవహారమంతా ఒకే తానులో గుడ్డ అయివుండి అదే గుడ్డలో చిరుగుల్ని మరకల్ని మాసికల్ని చూపించి ఎగతాళి చేస్తున్నట్టు వుంది.
మొదట ఉక్రోషపడిన చంద్రబాబు రాజకీయప్రక్రియద్వారానే దాదాపుగా ప్రత్యర్ధి దూకుడికి అడ్డుకట్ట పడే ఎత్తుగడలతో ముందుకుపోతున్నారు.
రాజకీయాల్ని రాజకీయాలతో ఎదుర్కోవాలి…చట్టాల్ని చట్టాలతోటీ, ప్రభుత్వాల్ని ప్రభుత్వాలతోటీ ఎదుర్కోవాలి. కెసిఆర్ ఆటనియమాన్ని మార్చే ప్రయత్నంలో వున్నారు. రాజకీయప్రత్యర్ధి తెలుగుదేశాన్ని అధికారంతో కట్టడి చేయాలనుకున్నారు. చాలావరకూ సఫలమయ్యారు కూడా! బయటపడటానికి తెలుగుదేశం రాజకీయప్రక్రియనే చేపట్టింది. ఉమ్మడి రాజధాని కనుక హైదరాబాద్ లో శాంతి భద్రతలు గవర్నర్ క అప్పగించాలని కేంద్రాన్ని కోరింది. ఇది తెలుగుదేశం వొళ్ళుకాచకునే కవచం మాత్రమే కాదు, ప్రత్యర్ధి టిఆర్ఎస్ ని అడుగుముందుకి పడనివ్వకుండా ఆపేసే ఆయుధం కూడా!
ఎత్తులు పై ఎత్తుల రాజకీయాలు సరే! రెండు రాషా్ట్రల మధ్య ఉద్వేగాలు సరే! 

ప్రజాప్రతినిధులను పార్టీలు కొనుక్కోవడమనే దుర్నీతికి ఇలాంటి పరిణామాల వల్ల, ఉద్విగ్నభరితమైన ప్రజామోదం లభించడమే అత్యంత విషాదం!

ఓటు నోటు రగడఒక పౌరుడి స్పష్టీకరణ


నోటుకి ఓటు తగాదాలో ” ఇది తనను ఎన్నుకున్న 5 కోట్లమందినీ అవమానించడమే” నన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయంతో నాకు సంబంధం లేదనీ, ఆ అభిప్రాయంతో విభేదిస్తున్నాననీ స్పష్టం చేస్తున్నాను. 

ముఖ్యమంత్రి ప్రస్తావించిన కోట్లమందిలో నేనూఒకడిని అయివున్నందున ఈ వివరణ ఇవ్వవలసి వచ్చింది. కాంగ్రెస్ ఏకపక్షంగా విభజించిన రాష్ట్రంలో నేను నివశిస్తున్న ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేస్తారన్న ఆశతో తెలుగుదేశం బిజెపి కూటమికి నేను ఓటు వేసిన మాట వాస్తవమే ఆదేవిధంగా నాబంధుమిత్రులను ప్రోత్సహించిన మాటా నిజమే!
ఓటూ నోటూ తగాదాలో పట్టుబడిపోయిన తెలుగుదేశం మీద కోపమేమీలేదు…ఓట్లు కొనిగెలవగల గెలుపుగుర్రాలనే (మనుషులు కారన్నట్టు) అన్నిపార్టీలూ పోటీకి నిలుపుతున్నపుడు టిఆర్ఎస్ నుంచో, తెలుగుదేశం నుంచో నీతినియమాలను ఆశించే పరిస్ధితిలేదు. 

నానారకాల ఆకర్షణలతో కెసిఆర్ కట్టుబాటుని తెగ్గొట్టారు. డబ్బెట్టి అదేపనిచేయబోయిన చంద్రబాబు దొరికిపోయారు. దీనినుంచి బయటపడటం ఆయన సమస్య, ఆయన పార్టీ సమస్య. చంద్రబాబు ఏదో ఉక్రోషపుఫ్లోలో అనేసినట్టు ఇది ఐదుకోట్ల మంది ప్రజల విషయం కానేకాదు. ఆప్రజల్లో నేనుకూడా ఒకడిని అయి వున్నందువల్ల ఈ ప్రకటన చేయవలసివస్తోంది. 
కెసిఆర్ చర్య చట్టవిరుద్దమూ అన్యాయమూ అయితే తెలుగుదేశంవారు ఉద్యమాలు సత్యాగ్రహాలు చేసి జైళ్ళునింపేసి ప్రజల సానుభూతి మద్దతు కూడగట్టుకోవచ్చుకదా! 

టివిల్లో అరచిపెడబొబ్బలు పెడుతున్న తెలుగుదేశం నాయకుల మాటలు యాక్షన్ సినిమాల్లో ఈలలు, కేకలుగానే కనబడుతున్నాయి. వీటివల్ల ఏప్రయోజనమూ వుండదు. సినిమా అయిపోగానే వెళ్ళిపోయే ప్రేక్షకులకు, టివికేమేరా మూసుకుపోగానే బట్టలు సవరించుకువెళ్ళిపోయే ఈ నాయకులకూ తేడావుండదు. పైగా అవాకులూ చెవాకులు మనకి బోనస్. తనను అరెస్టు చేస్తే తెలంగాణా ప్రభుత్వానికి అదే ఆఖరిరోజని స్వయంగా ముఖ్యమంత్రే ఆవేశపడిపోయాక, ఆయన సేన ఎన్ని కుప్పిగంతులైనా వేస్తుంది మరి. 
దొరికేవరకూ అందరూ దొంగలే! ఓటు నోటు రగడవల్ల ఒక ముఖ్యమంత్రే గిలగిలలాడిపోవలసివచ్చిన ప్రజాస్వామిక స్ఫూర్తిని నిలిపే చట్టాల్ని స్వాగతిస్తున్నాను

విలువల్ని తొక్కేస్తున్న ఉద్వేగం  రేవంత్ మీసంలో ఆంధ్రుల రోషం


టిఆర్ఎస్, తెలుగుదేశం సహా అన్నిప్రధాన పార్టీలూ సాధారణ ఎన్నికల్లో ఓట్లు కొంటున్నాయి. ప్రభుత్వాన్ని నిలుపుకోడానికి ప్రజాప్రతినిధులను పార్టీ మారేలా ప్రలోభపెట్టే సామదానబేధదండోపాయాలను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీయే. తిరుగులేని ఆధిక్యత కోసం గుత్తగా ఎమ్మెల్యేలను కొనే విధానాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి మొదలుపెట్టారు. ఇదంతా అవినీతే…ఇలా సామాజిక ప్రాబల్యం, రాజకీయ అధికారం ఉన్నవారు బాహాటంగా అవినీతికి పాల్పడుతున్నా రాజకీయాల్లో ఇది మామూలేలెమ్మన్న మెట్టవేదాంతం ప్రజలబుర్రలోకి ఎక్కేసింది. రాజకీయ అవినీతికి ప్రత్యర్థులు కూడా పాల్పడినపుడు, టివిగొట్టాలముందో, పత్రికాగోష్టుల్లోనో గొంతుచించుకుని నీళ్ళుతాగి వెళ్ళిపోయే ధోరణిని ఏప్రయోజనకోసమైనాగాని కెసిఆర్ మార్చేశారు. ఫలితంగా రేవంత్ రేడ్డి అడ్డంగా దొరికిపోయారు. తెలుగుదేశం ఆత్మరక్షణలో పడిపోయింది. 

నిజానికి ఈ ఉదంతంలో చట్టం నిర్వర్తించవలసిన బాధ్యతలేతప్ప ప్రజలు చేసేదేమీలేదు. అయితే ఇద్దరు ముఖ్యమంత్రులూ వారివారి పార్టీలూ పరస్పరం దూసుకుంటున్న మాటలు విభజనకు ముందు రెండు రాషా్ట్రల్లో గూడుకట్టుకున్న విద్వేషాలను తట్టిలేపుతున్నట్టువున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీ తెలంగాణా విభాగం ద్వారా తెలంగాణా ప్రభుత్వ వ్యవహారాల్లో వేలుపెట్టడం కెసిఆర్ కు ఆపార్టీకేగాక జనసామాన్యానికి కూడా ఇష్టంలేదు. అలాగే తెలుగుదేశానికి తెలంగాణాలో పనేమిటి అని విసుక్కునే వారు తెలుగుదేశంలోనేకాక సీమాంధ్రప్రాంత ప్రజానీకంలో కూడా హెచ్చుమందే వున్నారు. అదేసమయంలో కెసిఆర్ ను సహించని సీమాంధ్రులు ఆయన్ని ఎదిరించే హీరోగా రేవంత్ రెడ్డిని చూస్తున్నారు. 
పోలీసు ఎస్కార్టులో వున్నపుడు రేవంత్ రెడ్డి మీసం మెలివేయడం తెలంగాణా వారికంటే ఆంధ్రులకే హెచ్చుగా నచ్చిందంటే ఇటువైపు రగిలిన ఉద్వేగాన్ని అర్ధం చేసుకోవచ్చు. విభజనానంతరం ఏర్పడిన రాజకీయాల చిక్కుముడులనుంచి రూపొందుతున్న ఉద్వేగాలకు ఒక సూచిక. ఇందులో యాక్షన్ సినిమా ఇచ్చే కిక్కు వినోదమేకానీ, పతనమైన నీతికి సంకేతం కూడా! 

ఉభయరాష్ట్రాల నేతలూ అనేక కారణాల వల్లా, తమ వాగ్దానాలను నెరవేర్చగలిగే స్థితిలో లేరు. రాష్ట్రవిభజనకు సంబంధించిన ఉద్వేగాలు సజీవంగా వున్నంతకాలం వాగ్దానాల గురించి ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టరు. అలాంటి కాలయాపనకైనా గాని ఉభయులకూ కావలసింది ప్రజల ఉద్వేగాలే! 

పట్టుకున్న టిఆర్ఎస్ ని, దొరికిపోయిన తెలుగుదేశాన్ని పక్కనపెడితే- ఎమ్మెల్యేలను కొనడం ఏమిటని వైఎస్‌ జగన్ చీల్చి విమర్శలతో చీల్చి చెండాడుతారు. కాంగ్రెస్‌ పెద్దలు, రేవంత్‌ దీ తప్పే, టీఆర్‌ఎస్‌దీ తప్పే అంటూ- తమకసలు కొనుగోళ్లే తెలియనట్టు అమాయికంగా చూస్తారు. నీతిశాస్త్రానికే హక్కుదారులమన్నట్టు వ్యవహరించే బీజేపీ నేతలు ఏ మాటా గట్టిగా చెప్పలేక నీళ్లు నములుతుంటారు. 

ఇన్ని మాటలుచెప్పేవారెవరికైనా ఫిరాయింపుల చట్టాన్ని, ప్రజాభిమతాన్ని అవహేళన చేస్తున్న కొనుగోలు విధానాలమీద నిజమైనవ్యతిరేకత ఉన్నదా?

ఇలావుండగా విభేదాలను పక్కనబెట్టి సర్దుకుపో వాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాషా్టల్ర ముఖ్యమంత్రులకు ఉమ్మడి రాషా్టల్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ సూచించారు. అభివృద్ధిపై దృష్టిసారిస్తే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని హితవుపలికారు. 

ఎమ్మెల్సీ ఎన్ని కల సందర్భంగా చోటు చేసుకు న్న ఓటుకు నోటు వివాదం ఇరు రాషా్టల్ర ముఖ్యమంత్రుల మధ్య తీవ్ర స్థాయి విభేదాలకు దారితీయడంతో కేంద్రం సూచన మేరకు గవర్నర్‌ నరసింహన్‌ మూడు రోజుల ఢిల్లీ ముగించుకుని వచ్చిన వెంటనే శుక్రవారం తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ సీఎం ఎన్‌.చంద్రబాబు నాయుడుతో వేర్వేరుగా సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా గవర్నర్‌ కొంతకాలం పాటు సంయమనంతో వ్యవహరించాలని ఇరువురు సీఎంలను కోరినట్లు తెలిసింది. రెండు తెలుగు రాషా్టల్ర సీఎంలు పరస్పరం కయ్యానికి కాలు దువ్వితే ఆయా రాషా్టల్ర ప్రయోజనాలు దెబ్బతింటాయనీ, ఫలితంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు కుంటుపడే అవకాశం ఉందని అభిప్రాయపడినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే అభిప్రాయంతో ఉందనీ, కొంతకాలం పాటు ఇరువురు సంయమనం పాటిస్తే సమస్యల వాటంతట అవే సద్దుమణిగి పోతా యని నచ్చజెప్పినట్లు తెలిసింది. అయితే, గవర్నర్‌ సూచనపై ఇరు రాషా్టల్ర సీఎంలు కొంత సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. కేంద్రం సూచ నతో ఇరువురు సీఎంలతో చర్చలు జరిపితే రెండు తెలుగు రాషా్టల్రలోనూ విభేదాలు సద్దుమణిగే అవకాశం ఉందని కేంద్రం చేసిన సూచన మేరకే గవర్నర్‌ కేసీఆర్‌, చంద్రబాబుతో సమావేశం నిర్వహించినట్లు సమాచారం.

ఏలినవారి హింస ! 


నిజమైన ఎన్ కౌంటర్ వల్ల వెల్లువెత్తిన ఉద్వేగాల్ని ఊతం 
చేసుకుని వరుస హత్యలనే పరిపాలనా చర్యలుగా చేపట్టిన 
కెసిఆర్, చంద్రబాబు ప్రభుత్వాల 
నెత్తుటి చేతుల్లో మృగదశ అవశేషాలు భయపెడుతున్నాయి! 

ప్రాణరక్షణ హక్కుని ప్రాణంతీసే పనికి వుపయోగించుకునే ధోరణిని ప్రజలు నిలదీయకపోతే నచ్చనివారిని తొలగించుకుంటూ పోయే గూండాయిజాన్ని ప్రభుత్వయంత్రాంగానికి ఆయుధంగా ఇవ్వడమే…డెడ్ ఎండ్ అంటూ గోడ ఎదురైనపుడు పాలక-యంతా్రంగాల్లో తలెత్తే నిస్పృహ, అనాగరిక, పాశవిక నీతినే పాటిస్తూండగా, అరాచకాన్ని నిర్మూలించడానికి అదే అరాచకాన్ని ఆశ్రయిస్తూండగా, ఏలినవారే హింసాపిపాసులైపోతూండగా అదే గొడుగుకిందవున్న మనది నాగరీక సభ్య సమాజమని సంతృప్తిగా భావించుకోగలమా? 

నెత్తుటికూడు వెగటైన సామా్రట్ అశోకుని వలే మన ఏలికలు ఎప్పటికైనా పశ్చాత్తాపపడతారా? 

(కంటికి కన్ను ప్రాణానికి ప్రాణం అని వాదించే వారికి ఒక నమస్కారం) 

తెలుగు రాషా్ట్రలకు బిజెపి సమన్యాయం?


మిత్రపక్షమైన బిజెపి ఆంధ్రప్రదేశ్ ఏదేదో ఒరగబెట్టేస్తుందన్న తెలుగుదేశం భ్రమలు సన్నగిల్లుతున్నాయి. ఏకపక్షంగా సీమాంధ్ర గొంతుకోసిన కాంగ్రెస్ మీద అసహ్య, ద్వేషాలతో బిజెపికి ఓటు వేసిన సామాన్యుల్లో కూడా కేంద్రప్రభుత్వం అందించే సహాయ సహకారాలమీద ఆశలు నీరౌతున్నాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో బిజెపి మీద ఏదోవిధంగా అసంతృప్తి మొదలైంది.

అయిష్టంగానే అయినా బిజెపి కోరుకున్నది ఇదే. బిజెపికి తెలుగుదేశం నాయకత్వంలో వున్న ఆంధ్రప్రదేశ్ ‘ఎక్కువ’ అనే హైప్ ని తొలగించడమే ప్రధమ కర్తవ్యంగా దేశాన్ని పాలిస్తున్న పార్టీ నిర్ణయించుకున్నట్టు అర్ధమౌతోంది.

ఈ హైప్ కి తెలుగుదేశం అత్యుత్సాహం అసలు కారణమైతే, ఒకసారి చెబితే లక్షసార్లు చెప్పినట్టే అనే పిచ్చిపోటీ ధోరణితో పనిచేసే తెలుగు న్యూస్ టివిల బాధ్యతా రాహిత్యమే ప్రధానకారణం.

తెలంగాణా ఏర్పాటు అవసరాన్ని కుండబద్ధలు కొట్టినట్టు ప్రటటించిన చిన్నమ్మ సుష్మా స్వరాజ్ మాటలకంటే ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్, స్మార్ట్ సిటీస్ లాంటి వెంకయ్యనాయుడు హామీలే జనంలోకి విస్తృతంగా వెళ్ళిపోయాయి.ఆంధ్రప్రదేశ్ కి ఏంటి బిజెపి కొండంత అండ అనే సంకేతాలు తెలంగాణాతో సహా ముఖ్యంగా దక్షిణాది రాషా్డ్రలకు పాకిపోతున్న స్ధితిలో బిజిపి దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. పొడిపొడి తిరస్కారాలద్వారా ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తులను పక్కనపెట్టసాగింది.
తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఎపి ప్రజల్ని నిరాశా నిస్పృహలకు లోను చేసే వాతావరణం వల్ల ఈ రాషా్ట్రనికి స్పెషల్ స్టేటస్ ఇవ్వొద్దని అభ్యంతరాలు పెట్టిన తమిళనాడు, కర్నాటక రాషా్ట్రల కడుపుమంట/ఆక్రోశం తగ్గాయి.

మోడీయా గీడీయా అన్న మన దాయాది ముఖ్యమంత్రి కెసిఆర్ కి కూడా ఈ వాతావరణమే ప్రధానమంత్రి దర్శన ద్వారానికి తలుపుతీసింది. దర్శనమవ్వడమంటే పరస్పరం ముఖాముఖీ అవ్వడమే.ఆఇద్దరికీ అదే ముఖ్యం …ఆసమయంలో మీరు అంతగొప్పవారు లేరని పరస్పరం ప్రశంసలు వారివారి ప్రజలకు ముఖ్యం…ఇవి జరిగిపోయాయి కాబట్టి ఇక ఎపుడైనా టి ఆర్ ఎస్ కేంద్రంలో మంత్రిగా భాగస్వామి కావచ్చు. అలాగే బిజెపి ఎమ్మెల్యేలు తెలంగాణా ప్రభుత్వంలో చేరవచ్చు. ఈ రెండూ జరగవచ్చు…జరగకపోవచ్చు..అయితే టి ఆర్ ఎస్ కు బిజెపిలో వి ఐ పి గేట్ పాస్ దొరికింది.

బిజెపి నుంచి ఎన్నో నిరాశలను చవిచూసిన తెలుగుదేశానికి తాజా పరిణామాలను ఇముడ్చుకోగల నిబ్బరం సహజంగానే వచ్చేస్తూంది..బిజెపికి కావలసింది ఇదే.

నా అంచనా ప్రకారం ఇక మీదట కేంద్రప్రభుత్వం రెండు తెలుగు రాషా్ట్రలకూ (అవి కోరినట్టు కాక తాను నిర్దేశించుకున్న ప్రాధాన్యతల ప్రకారం) సహాయ సహకారాలు అందించడం మొదలౌతుంది. ఆ కార్యక్రమాలు రెండు రాషా్ట్రల్లోనూ బిజెపి పట్టు విస్తరించే దిశగానే వుంటాయి.

ఇక్కడ దాయాది ముఖ్యమంత్రుల మీడియా సంబంధాలను కూడా ప్రస్తావించుకోవాలి.
ఏ రాజకీయవాదికైనా మీడీయా అవసరం వుంటుంది. అధికారంలో వున్న నాయకుడికి కావాలనుకున్నా, వొద్దనుకున్నా స్విచ్ వేసి తీసే పదవీ సౌలభ్యం సౌలభ్యం వుంది. కెసిఆర్ కి మీడీయాను వాడుకునే టైమింగ్ అద్భుతంగా వుంది.
చంద్రబాబుకి అది చేతకాదు. ఆయనకి మీడియా ఒక బలహీనత. అది 24/7 వుండవలసిందే. ప్రింట్ మీడియావల్ల పెద్ద ఇబ్బంది లేదు. విజువల్ మీడియా తోనే సమస్యంతా! అందులో ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్టే! అతి వెగటవ్వడం సాధారణమే కదా!

కేంద్రప్రభుత్వ విధానాలకు అనుగుణంగా తెలంగాణా ప్రభుత్వ కార్యక్రమాలు రూపొందించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు అని టివిలో వార్త వస్తుంది. అధికారులు ఆపనిలో నిమగ్నమైపోతారు.

ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడైతే ‘ అలాంటి కార్యక్రమాలే రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ అధికారులను ఆదేశించాను. ఊరుకోను ప్రతి ఒక్కరినీ మానిటర్ చేస్తాను’అని లైవ్ లో చెబుతారు. ఆపని చేయవలసిన అధికారులు ముఖ్యమంత్రి తదుపరి ఆదేశాలకోసం టివిల్లో కి చూస్తూనే వుంటారు.

మీడియా సంబంధాలూ, పర్యావసానాల్లో కెసిఆర్ కి బాబుకీ తేడా ఇదే!

కెసిఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 💐


‘చార్మినార్ కి ఎప్పుడైనా ఇంత సున్నం కొట్టించారా ఏం కాగ్రెస్ వాళ్ళయ్యా’ అని
కెసి ఆర్ అన్నపుడు అవును కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వస్తుందే తప్ప చార్మినార్ కీ కాంగ్రెస్ కి లంకె ఏమిటా అన్న ఆలోచనే మనకి రాదు ….

కెసిఆర్ గారు అంతటి మాటల మాంత్రికుడు.

భాష, సంస్కృతీ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు తెలంగాణా ఉద్యమంలో పొదిగి ప్రపంచవ్యాప్తంగా వున్న తెలంగాణీయుల్లో భావసమైక్యతను సాధించిన అపూర్వ రాజకీయ నాయకుడు కెసిఆర్ గారే !

టివిలో ఆయన మాటలు మిస్ అవ్వను! ఆయన డబాయించేస్తున్నారని చాలా సార్లు తెలిసిపోతుంది. అయినా ఆ మాటలు వినబుద్ధి అవుతుంది

ఆయన బాగా చదివే మనిషి …అలాంటివాళ్ళంటే నాకు ప్రేమ, గౌరవం!

కెసిఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 💐