పెద్దాడ నవీన్)
20-7-2018
ఇంటికే పరిమితమైన సామాజిక జీవనం…లివింగ్ రూమ్ కే పరిమితమైన
కుటుంబ జీవనం…మమ్మీ, డాడీ – వాళ్ళ తోబుట్టువులను, వారి బాధ్యతలను వొదిలించుకోడానికి చూపించే లౌక్యం, పడే శ్రమ…పైమెట్టు మీద వున్నవారితో పరిచయాలు పెంచుకునే తాపత్రయాలు, సంబంధాలు, స్నేహాలు…
వ్యక్తిత్వ వికాసానికి అమ్మ నాన్నల గైడెన్స్ అవసరమైన టీనేజిలో మనోభావాల్ని, సహజస్పందనల్ని చిదిమేసే బ్రాండ్ (నారాయణ చైతన్య)చదువులు…అవసరానికి మించి యిచ్చే పాకెట్ మనీ…ఏమి తాగాలో ఏమి తినాలో ఏమిచెయ్యాలో ఎలా వుండాలో నిర్ణయించే మార్కెట్…వీటి మధ్యే తిరుదుతున్న, పెరుగుతున్న పిల్లలకు ప్రేమంటే????
వీళ్ళకి పరిసరాలను, చుట్టు వున్న సమాజాన్ని, ప్రకృతిని, చుట్టూవున్న మనుషుల్ని, టీచర్లని, తోటి పిల్లల్ని, తాతయ్యల్ని, అమ్మమ్మల్ని, నానమ్మల్ని, చివరికి మమ్మీ, డాడీలని కూడా ప్రేమించడం తెలియదు. వియ్ లవ్ ఆల్ అని పెట్ యానిమల్స్ పేర్లను కలుపుకుని పెద్ద లిస్టే చదువుతారు…అందరినీ ప్రేమిస్తున్నామనే అనుకుంటారు…అసలు వీళ్ళకి ప్రేమంటే తెలియదు…
వీళ్ళకి ప్రేమంటే- యవ్వనంలో స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణను పరస్పరం వ్యక్తీకరించుకునే మోడ్…ఇష్టపడినది దక్కని స్ధితి ఎదురైతే ఆ షాక్ నుంచి బయటపడటానికి సమాజంలో సమాజంతో వీరికి బలమైన అనుబంధాలు లేవు…దేనికోసమో బతకాలి బతికితీరాలి అనుకోడానికి వీరికి ఏ విధమైన ఆలంబనా లేదు…
పరిసరాల్ని ప్రేమించలేనివారు పౌరులు కాలేరు…ప్రతి ఒక్కరిలో స్వాభావికంగా వుండే భావనాత్మక సౌందర్యం ( ఈస్ధటిక్ సెన్స్) భౌతిక ప్రపంచాన్ని మించిన భావనా ప్రపంచాన్ని పిల్లల హృదయంలో, మనసులో, ఆలోచనలలో నిర్మిస్తుంది…అది లౌకికప్రపంచంలో కార్నర్ అయిపోయినప్పుడు మనుషులకు సేఫ్టీ నెట్ అవుతుంది…అది మనుషుల్ని అక్కున చేర్చుకుని కొత్తజీవితానికి, కొత్త అనుబంధాలకు ప్రేరణ ఇస్తుంది…విఫలమైన / భగ్నమైన ప్రేమ కొంత సమయం తీసుకుని తిరిగి హృదయానికి చేరుకుంటుంది…
అసలు, సమస్యంతా పిల్లలకు భావనా ప్రపంచం లేకపోవడమే…మమ్మీ, డాడీ, కుటుంబం, నైబర్స్, స్నేహితులు, టీచర్లు, సమాజం, ప్రకృతి….దేనితోనూ అటాచ్ మెంటు లేకుండా పెరిగే పిల్లలకు మానసిక పర్యావరణం / ఎమోషనల్ ఎన్విరాన్ మెంటు ఎక్కడుంటుంది?
17.010653
81.801869