Search

Full Story

All that around you

Tag

modi

కల్చరల్ పోలీసింగ్ పై ఆవేదన అవార్డుల వాపసుతో రచయితల నిరసన


మతద్వేషం, ప్రశ్నించే వారిపై దాడులూ, ఆందొళనకరంగా పెరిగిపోతున్న ”కల్చరల్ పోలీసింగ్” పై రచయితల అవేదనకు, నిరసనకూ ఉన్నత స్ధాయి నుంచే స్పందన రావాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనం వీడాలి…దురదృష్టకరం…మాకు సంబంధంలేదు వంటి పొడిపొడి ఖండనలు కాకుండా ఆవేదనకు ఉపశమనం కలిగించాలి.
http://www.telugu360.com/te/writters-refunding-govt-awards-in-protest/
  

హుదూద్’ ఇళ్ళు కట్టలేదు సరే! 260 కోట్ల విరాళాలు ఏమయ్యాయి మరి?


ఉత్తరాంధ్ర, విశాఖ నగర రూపురేఖలను చిన్నాభిన్నం చేసిన ప్రచండ తుపాను ‘హుదూద్‌’ ప్రాంతాల పునర్నిర్మాణం మొదలుకాలేదు. బాధితుల సహాయ, పునరావాసాలపై ప్రభుత్వం హామీలు నెరవేరలేదు. ఒక్క పటిష్ట, శాశ్వత చర్య కూడా లేదు.తుపానుకి చితికపోయిన విశాఖ మురికివాడలను, మత్స్యకార ప్రాంతాలను చూస్తే ప్రచారంలోని డొల్లతనం ప్రత్యక్షమౌతుంది.
http://www.telugu360.com/te/no-rehabilitation-even-after-1-year-hudhud/ 
  

ఎపికి మెట్రో రైలు కుదరదు 


ప్రపంచమే మార్కెట్ అయిపోయాక లాభాలే తప్ప ప్రజాప్రయోజనాలు వుండవు. ప్రభుత్వాలే కాళ్ళావేళా పడినా ‘డబ్బు’ నష్టానికి ఒప్పుకోదు. విజయవాడ మెట్రోరైలు పట్టాలు ఎక్కదు. తలతాకట్టు పెట్టుకుంటేతప్ప రైతుపొలాన్ని సింగపూర్ వాడిక ఇచ్చేస్తేతప్ప నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కి హోదాగానో, పాకేజిగానో ఉదారంగా మోదీ ఇవ్వడానికి ‘డబ్బు’ ఒప్పుకోదు. 

http://www.telugu360.com/te/union-government-rejects-vijayawada-metro-proposal/ 

 

బిజెపి మీద అవినీతి మచ్చలు !(శనివారం నవీనమ్)


పదేళ్ల యుపిఎ హయాంలో కాంగ్రెస్‌ మంత్రులు, ముఖ్యమంత్రులు అవినీతిలో మునిగిపోగా, కాంగ్రెస్‌ అవినీతిని దుమ్మెత్తిపోసి అధికారంలోకొచ్చిన బిజెపి, ఏడాదిలోనే అవినీతి మచ్చల్ని వొదిలించుకోలేనంత గాఢంగా అంటించుకుంది. ఒక్కొక్కటిగా బయట పడుతున్న బిజెపి నేతల అవినీతి, అక్రమాలు ఆ పార్టీకి తల బొప్పి కట్టిస్తున్నాయి. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన సుష్మా స్వరాజ్‌, వసుంధరా రాజే, స్మృతీ ఇరానీ, పంకజ్‌ ముండే – ఈ నలుగురూ పార్టీలోని శక్తివంతమైన మహిళలే! 

సుష్మా స్వరాజ్‌, వసుంధరా రాజే, పంకజా ముండే అక్రమాలతో బిజెపి నాయకులు, ప్రధాని నరేంద్ర మోడీలకు మొహంచూపించలేని అవస్ధ. ఈ ఉదంతాలకు స్మృతి ఇరానీ విద్యార్హతల వివాదం తోడై ఊపిరాడని దుస్ధితి. ఆత్మరక్షణలో పడ్డ ప్రధాని, బిజెపి అగ్ర నేతలు ఆరోపణలెదుర్కొంటున్న వారందరినీ సమర్థించడమే పనిగా పెట్టుకున్నారు. నిందితులను వెనకేసు కొచ్చేందుకు ఏ మాత్రం జంకూ గొంకూ ప్రదర్శించట్లేదు. నీతులు ఎదుటి వారికి తప్ప తమకు కాదన్నట్లు ఆ పార్టీ వ్యవహరించడం దారుణం. 
ఎవరిని ఏమంటే ఎవరి మెడకు ఏం చుట్టుకుంటుందోనన్న భయం బిజెపి నేతలను వెంటాడుతున్నట్లుంది. అందుకే ఆరోపణలెదుర్కొంటున్న వారిపై ఈగ వాలనీయడం లేదు. ఎన్నికల్లో బిజెపి నినాదం కుంభకోణాల కాంగ్రెస్‌ను గద్దె దించడం. అవినీతి రహిత పాలన అందించడం. మోడీ ప్రభుత్వం, సంవత్సరంలోనే ఆ హామీ నుంచి పూర్తిగా వైదొలిగింది. అవినీతి విషయంలో తమది యుపిఎ కాదని ప్రధాని చెప్పుకుంటున్నారు. 
యుపిఎ ప్రభుత్వంలో భారీ బొగ్గు స్కాంను కోల్‌గేట్‌ అన్నారు. అనంతరం రైల్వే గేట్‌ ముందుకొచ్చింది. ఎన్‌డిఎ సర్కారులో లలిత్‌ గేట్‌ బిజెపిని, కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. లలిత్‌ గేట్‌లో తొలుత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ పేరు వెల్లడైంది. ఐపిఎల్‌ మాజీ అధిపతి, ఆర్థిక నేరగాడు లలిత్‌ మోడీకి బ్రిటన్‌ నుంచి పోర్చుగల్‌ వెళ్లేందుకు సుష్మా మంత్రి హోదాలో వీసాకు సిఫారసు చేసిన ఉదంతంపై బ్రిటిష్‌ మీడియా భారత్ పరువు తీసింది. కేవలం మానవతా దృక్పథంతోనే వీసాకు సాయం చేశానని సుష్మా చెప్పిన అబద్ధం అతకలేదు. లలిత్‌ మోడీ విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) లలిత్‌ అక్రమాలపై దర్యాప్తు చేస్తోంది. ఐపిఎల్‌ బెట్టింగ్‌లు, ఆర్థిక లావాదేవీలు, కుంభకోణాలకు పాల్పడి దేశం విడిచి లండన్‌కు పారిపోయిన వైట్‌ కాలర్‌ క్రిమినల్‌ లలిత్‌ మోడీ. అతగాడిపై రెడ్‌, బ్లూ కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. అలాంటి నేరస్తుడికి కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మన దేశానికి రప్పించి, అక్రమాలపై విచారణకు ఆదేశించాల్సింది పోయి దేశాలు తిరగడానికి వీసా ఇప్పించడమేంటి? సుష్మా కుటుంబానికి, లలిత్‌ మోడీకి సంబంధాలున్నాయి. లలిత్‌ తరఫున కోర్టుల్లో సుష్మా భర్త, కూతురు వాదిస్తున్నారు. సుష్మా క్విడ్‌ప్రోకో నిరూపణకు ఈ ఆధారాలు సరిపోతాయి. అయినా నరేంద్ర మోడీ సర్కారు, బిజెపి సుష్మాను వెనకేసుకొచ్చాయి. 
రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సైతం లలిత్‌ మోడీ వీసాకు సహకరించి అడ్డంగా దొరికిపోయారు. ప్రతిపక్ష నాయకురాలిగా ఉండి బ్రిటన్‌ ఇమ్మిగ్రేషన్‌కు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. పైగా తాను సిఫారసు చేసినట్లు భారత అధికారులకు తెలపొద్దని షరతు పెట్టారు. ఆ పత్రం బయటపడ్డాక కూడా వసుంధరా రాజీనామా చేయాల్సిన అవసరమే లేదని బిజెపి వత్తాసు పలకడం ఆమె అక్రమాలను సమర్థించడమే అవుతుంది. లలిత్‌ మోడీ అక్రమంగా ఎదిగిపోడానిక వసుంధరా రాజేనే కారణం. ఆమె ముఖ్యమంత్రిగా అందించిన సహకారంతోనే రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసి బిసిసిఐ, ఐపిఎల్‌ స్థాయికి అంచెలంచెలుగా ఎదిగాడు. అందుకు ‘ఉడతా భక్తి’తో వసుంధర తనయుడు, బిజెపి ఎంపి అయిన దుష్యంత్‌ కంపెనీలో పది రూపాయల ముఖ విలువ చేసే షేర్‌ను రూ.96 వేల చొప్పున 815 షేర్లు కొనుగోలు చేశారు. లలిత్‌ మోడీకి, వసుంధర కుటుంబాలకు మధ్య సంబంధాలకు ఇంతకంటే ఏ సాక్ష్యాలు కావాలి? వ్యాపార వృద్ధిని ఆశించి అత్యధిక ధరకు లలిత్‌ షేర్లు కొన్నారని బిజెపి వాదించడం ఘోరం. 
మహారాష్ట్రలో బిజెపి మంత్రి పంకజా ముండే అవినీతి మరీ క్షమించరానిది. అంగన్‌వాడీ కేంద్రాల్లో పేద పిల్లలకు అందించే వేరుశనగ పప్పుండలు, దుప్పట్లు, చాపల కొనుగోలులో రూ.200 కోట్లకు పైగా మెక్కారు. ఒకే రోజు టెండర్లు లేకుండా వందలాది ప్రభుత్వ తీర్మానాలతో వస్తువులు కొన్నారు. మంత్రి పంకజాపై ఎసిబి వద్ద కేసు నమోదు కాగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిదీ సమర్థన పల్లవే. 
ఇక కేంద్ర మంత్రి స్మృతి ఇరానీది మరో వివాదం. ఎన్నికల కమిషన్‌కు అందజేసిన అఫిడవిట్‌లో విద్యార్హతలపై తప్పుడు సమాచారం ఇచ్చారంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ మెట్రోపాలిటన్‌ కోర్టు విచారణకు స్వీకరించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చిన వ్యక్తి పదవిలో కొనసాగడానికి వీల్లేదు. లలిత్‌ గేట్‌లో కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, ఎంపి ఇరుక్కున్నా, మహారాష్ట్ర మంత్రి భారీ స్కాంకు పాల్పడ్డా, మరో కేంద్ర మంత్రి స్మృతిపై తప్పుడు అఫిడవిట్‌ కేసు కోర్టులో విచారిస్తున్నా ప్రధాని నరేంద్ర మోడీ మౌనం దాల్చడం గర్హనీయం. 
కుంభకోణాలు, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడ్డ వారిని పదవుల నుంచి తొలగించి సమగ్ర విచారణ జరిపించినప్పుడే అవినీతి రహిత పాలన హామీకి కొంతైనా విలువ ఉంటుంది. ఆరోపణలెదుర్కొంటున్నవారిని పదవుల్లో కొనసాగించడం అనైతికం అనిపించుకుంటుంది.
ఇలావుండగా నరేంద్ర మోడీ ప్రభుత్వ నిరంకుశ పోకడలపై ప్రతిపక్షాల నుంచే కాదు, సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రామ్‌ జెత్మలాని, అరుణ్‌శౌరీ నేడు కీర్తీ ఆజాద్‌, శత్రుఘ్న సిన్హా, యశ్వంత్‌ సిన్హా, ఎంపి ఆర్‌కె సింగ్‌ ఇలా ఒక్కొక్కరు ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు. బిజెపిలో మోడీ-షాలు అన్నీ,అంతా తామే అన్నట్లుగా వ్యవహరించింది. వీరిధోరణి మీద ద్వితీయ శ్రేణి నాయకత్వం గుర్రుగా వుంది. రాంజెత్మలానీ, అరుణ్‌శౌరీ వీరికి మొదట దారి చూపారు. లలిత్‌గేట్‌ వ్యవహారం బయటపడ్డాక యశ్వంత్‌ సిన్హ, ఆర్‌కె సింగ్‌ లాంటివారు తిరుగుబాటు స్వరాలను వినిపించడం మొదలెట్టారు పార్టీలోని నలుగురు శక్తివంతమైన మహిళలు -సుష్మా స్వరాజ్‌, వసుంధరా రాజే, స్మృతీ ఇరానీ, పంకజ్‌ ముండే- లు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడంతో వారిని దీనినుంచి ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం, బిజెపి ప్రయత్నాలు ముమ్మరం చేసిన తరుణంలో పార్టీలో కొందరు ఈ తిరుగుబాటు స్వరాలు వినిపించనారంభించారు. 
2014 మే 26న ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి 75 ఏళ్లు దాటిన వారందరూ బ్రెయిన్‌ డెడ్‌ కింద మారిపోయారని యశ్మంత్‌ సిన్హా వ్యంగ్యంగా విమర్శించారు. ఇక కీర్తీ ఆజాద్‌ డిడిసిఏలో అక్రమాలు జరిగాయని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీపై ప్రత్యక్షంగానే దాడి చేశారు. డిడిసిఏకి జైట్లీనే అధిపతి. తమ పరిధులను దాటి ప్రవర్తిస్తే సహించేది లేదని పార్టీ సభ్యులకు మోడీ-షా నాయకత్వం హెచ్చరించినా, అసమ్మతి స్వరాలు ఊపందుకోవడం గమనార్హం. ప్రభుత్వం, పార్టీ బలహీనపడ్డాక ఈ అసమ్మతి సెగ మరింతగా విస్తరించే అవకాశముంది. 

 

ఉసురు


ఒక బాకీ వున్న వ్యక్తికి అదితీరకుండా, లేదా రీషెడ్యూలు కాకుండా, ఏ బ్యాంకూ కొత్త రుణం ఇవ్వదు. ఈ షరతులకు లోబడే రైతులు అప్పులతో వ్యవసాయం చేస్తున్నారు. 

చంద్రబాబునాయుడు, రుణమాఫీ చేస్తామన్నారు. 50 వేలరూపాయలకు మించిన రుణాలున్నవారిలో ఏడాదికి 20 శాతం మందికి మాఫీ అని ముఖ్యమంత్రి అయ్యాక ఒక ఫిల్టర్ పెట్టారు. రుణాలు మాఫీ అయిపోతున్నాయి అన్న ఆశతో రైతులు వడ్డీలు కట్టడం మానేశారు. బకాయిలు చక్రవడ్డీలైపోయాయి. బాకీతీరలేదు…రుణం రీషెడ్యూలుకాలేదు…రుణాన్ని ప్రభుత్వం తనపేరుకు బదలాయించుకోలేదు..రైతులకు ప్రభుత్వం ఇచ్చిన బాండ్లను బ్యాంకులు తీసుకోవడం లేదు…
ఇందువల్ల చాలాకాలం తరువాత సార్వా పెట్టుబడులకు ప్రయివేటు వ్యాపారినుంచి వడ్డీకి డబ్బుతేవలసి వచ్చింది..కష్టమో సుఖమో అప్పులతోనే రైతులు బతుకుతూంటే చంద్రబాబు రుణాల మాఫీ అని ఇంకా అప్పులో ముంచేశాడు. 85 పైసల బాంకు వడ్డీ నుండి రెండున్నరరూపాయల ప్రయివేట్ వడ్డీలోకి నెట్టేశాడు
ఈ మాటలు నావి కాదు చల్లావారిగూడెం రైతు టేకి ఆంజనేయులు చెప్పిన వివరాలు. ఆయన విద్యావంతుడైన 12 ఎకరాల మెట్టరైతు. ఆయన కుటుంబంలో ఒకరికి న్యూరలాజికల్ సమస్యవుంది. నేను పనిచేసే జిఎస్ఎల్ మెడికల్ కాలేజి టీచింగ్ హాస్పిటల్ లో ఆసర్జరీ వుందా అనితెలుసుకోడానికి ఆంజనేయులు ఫోన్ చేశారు. మూడురోజులుగా సంబంధిత డాక్టరు, నేను, ఆంజనేయులు ఫోన్ లో మాట్లాడుతున్నాం. ఆసమస్యకు పరిష్కారం దొరికింది. కాస్తకుదుటబడిన ఆంజనేయులుతో వ్యవసాయం ఎలావుందని ప్రశ్నించినపుడు ఇదంతా చెప్పారు.
ఆంజనేయలు చెప్పకపోయినా కూడా అనేకమంది రైతుల అనుభవాల వల్ల ఇదంతా నాకు ముందే తెలుసు…
రాషా్ట్రనికి స్పెషల్ స్టేటస్ విషయంలో మోసం చేసిందని రాజకీయపార్టీలు, (నాతో సహా) జర్నలిస్టులూ అవకాశందొరికితే/దొరకబుచ్చుకునీ బిజెపిని దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక విధంగా తెలుగుదేశం రైతులకు చేసిన దగాకంటే, బిజెపి మాటతప్పి చేసిన మోసం చిన్నదే.
ఎలాగైనా అధికారంలోకి ఎక్కెయ్యడానికి రుణమాఫీ అని చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ కు పెద్దకొడుకునని నరేంద్రమోదీ పర్యావసానాలు ఆలోచించని మాటలు అన్నందుకు రైతులూ, ప్రజలూ వారిని (ప్రస్తావన వస్తే తిట్టుకోవడం మినహా) పల్లెత్తు మాటకూడా అనకపోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియడం లేదు. 
భూదేవి సహనమంటే ఇదేనా? నడిసముద్రంలో నిస్సహాయత ఇదేనా? ఇదే మానొసటిరాత అనే నిర్లిప్తత గానా? 
కానీ, ఒకటి ముమ్మాటికీ నిజం…ఆగ్రహంగా, ఆక్రోశంగా మారని కష్టం బాధితులను మరింత దుఖపెడుతుంది! చేయనితప్పుకి శిక్షపడినపుడు నిందించడానికో శాపనార్ధాలు పెట్టడానికో ఎవరూ లేకపోవడమంతటి కష్టం మరొకటి వుండదు!!

తెలుగుదేశం మిత్రులను ఉద్దేశించి…


మాటనిలబెట్టుకోలేదని బిజెపి మీద సగటు ఆంధ్రప్రదేశ్ మండిపడుతూండడం నిజమే! కష్టకాలంలో మాట ఇవ్వడం తప్ప బిజెపికి ఈ రాషా్ట్రనికి ఎలాంటి ఎమోషనల్ అటాచ్ మెంటూ లేని మాటా కూడా నిజమే!! మరి ఆక్రోశాన్ని వెలిబుచ్చడానికి ఎవరున్నారు? కాంగ్రెస్ ని అందామా అంటే ఆంధ్రప్రదేశ్ వరకూ అది కుళ్ళిపోతున్న శవం…వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనబలమే తప్ప నీతిబలమే లేదు. పాలనలో విధానాల్లో లోపాలు, లొసుగులు, లుకలుకలు కూడా కలగలిపిన తెలుగుదేశమే ప్రజల మంచి చెడులకు జవాబుదారీగా వుండాలి. 

ఏమి చేసినా చెల్లిపోతూందనే వైఖరినే తెలుగుదేశం కొనసాగిస్తే ఆదేసూత్రం కేంద్రప్రభుత్వానికికూడా వర్తిస్తుంది. తెలుగుదేశం పదేళ్ళు అధికారానికి దూరంగా వున్న సమయంలో పార్టీని ఆదుకున్నది సుజనాచౌదరి, సిఎంరమేష్, నారాయణ వగైరా లాభసాటి వ్యాపారులే కావచ్చు. అలాంటివారి పట్ల చంద్రబాబుకి ఎనలేని కృతజ్ఞతల భారం వుండటం తప్పుకాదు. కానీ, అలాంటి వారికి ప్రభుత్వంలో నేరుగా కీలక బాధ్యతలు అప్పగించడం సమంజసంకాదు. ఇది ప్రజల కష్టనషా్టల్లో ప్రజలతో ప్రయాణించిన పార్టీ సీనియర్లను అవమానించడమే.ఇది ప్రజాస్వామ్య దృక్పధంలో కి ధనస్వామ్యాన్ని చొప్పించడమే. ఈ ధోరణి సామాన్య ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయడమే కాక క్రమంగా వాటిని చంపేయడం కూడా. ఇందులో ముందుగా నిర్వీర్యమయ్యేది పార్టీయే…అది ఇప్పటికే మొదలైందని నా నమ్మకం.

అందరితో మంచి అనిపించుకోవాలన్న అతి తాపత్రయం వల్ల చంద్రబాబు పిల్లి మెడలో గంటకట్టీ, అదితానేనని నిలబడలేకపోతూంటారు. వ్యవసాయం దండగమారి దని ముందుగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఆయనే. విమర్శలు వెల్లువెత్తేసరికి వెనక్కి వెళ్ళిపోయారు. ఇపుడు వ్యవసాయం ఏమీ ఉద్దరించబడలేదుకదా!
రాష్ట్రవిభజన అనివార్యమని సామాన్యులకు కూడా అర్ధమైపోయిన నేపధ్యంలో కొత్తరాజధానికి నాలుగైదు లక్షలకోట్ల రూపాయలు అవసరమని చెప్పిన బాబు విమర్శలు రాగానే వెనక్కి వెళ్ళిపోయారు. అపుడే ఆయన గట్టిగా నిలబడి వుంటే నిరర్ధకమైన సమైక్య ఉద్యమం స్ధానంలో సీమాంధ్ర హక్కుల పరిరక్షణ ఉద్యమానికి ఆయనే ఆద్యుడైవుండేవారు. 

ఎవర్ని ఎంత తిట్టుకున్నా పొగుడుకున్నా వచ్చేనాలుగేళ్ళూ ఆంధ్రప్రదేశ్ బాధ్యత తెలుగుదేశానిదే! రాషా్ట్రనికి ప్రత్యేకహోదా రాదని తేలిపోయినందువల్ల బిజెపితో సంబంధాలు సహా బహిర్గత, అంతర్గత వైఖరులను సమీక్షించుకుని కొత్త ప్రయాణం ప్రారంభించడానికి తెలుగుదేశం పార్టీకి ఇది కీలకమైన సందర్భం! 

దీనితో సంబంధం, నిమిత్తం లేని రెండు అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవాలి : ఒకటి-సీమాంధ్రలో బలంగా వున్నకాంగ్రెస్ తనను తాను పాతిపెట్టుకుంది…రెండు-ఆంధ్రప్రదేశ్ లో బాగా ఎదిగే అవకాశాలున్న బిజెపి పుట్టకముందే చచ్చిపోయింది 
వినియోగించుకోవడం చాతనైతే ఈ రెండూ తెలుగుదేశానికి మంచి అవకాశాలే!!

సిగ్గూ ఇంగితం మరచిన ఓ కీర్తి కండూతి కాంగ్రెస్ పుర్రెల దండతో  కెనడాలో ఊరేగింది 


సిగ్గూ ఇంగితం మరచిన ఓ కీర్తి కండూతి కాంగ్రెస్ పుర్రెల దండతో  కెనడాలో ఊరేగింది

పర్యావసానమెరుగని జ్ఞానం వల్ల బుద్ధి కించపడింది 

చిరుమోతాదువిషంలాగ అహంకారం తలకెక్కిన కొద్దీ వ్యక్తిత్వం మృతకణమైపోతుంది.

వారు దేశాన్ని చెత్త చెత్త చేసి వెళ్ళిపోయారుఅని కెనడా-టోరంటో సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్ ని యుపిఎ ప్రభుత్వాన్ని విమర్శించడం ఏ విధంగానూ సమర్ధనీయమనిపించడంలేదు. పాలకులు మారినా నిరంతరాయంగా కోనసాగే ప్రభుత్వ వ్యవస్ధలో రాజకీయ ప్రత్యర్ధులను పరదేశంలో, ఆదేశాధినేతల సమక్షంలో చులకన చేయడం భారతదేశాన్ని అవమానించడమే.

మోదీ అంతటి మనిషికి ఇది తెలియదని అనుకోలేము. తనను తాను కొత్తగా ప్రతిష్టించడానికి ఉద్దేశ్యపూర్వకంగానే పరాయి నేలమీద సాంప్రదాయిక గౌరవ మర్యాదలను పెకలించి వేశారనుకోవాలి. కీర్తి కండూతి తలకెక్కి దిగిరావడంలేదనుకోవాలి. పరనిందకు ఆత్మస్తుతికి హద్దులు చెరిగిపోయాయనిపిస్తూంది. మోదీ కాంగ్రెస్ కంటే గొప్ప వారు కావచ్చు, బిజిపికంటే చాలా గొప్పవారు కావచ్చు. కానీ దేశం కంటే గొప్పవారు కానేకారు. 

(120 కోట్లమంది వున్న పాలనా వ్యవస్ధకు అధినేత అయిన భారత ప్రధాని శైలి మీద వ్యాఖ్యానించే అర్హతా యోగ్యతా నాకు నిస్సందేహంగా లేవు. చాలా ఆలోచించి ఉండబట్టలేక కొంత అయిష్టతతోనే నేను సైతం సహేతుకమైన ఈ నాలుగు రాళ్ళూ వేస్తున్నాను) 


గ్యాస్ సబ్సిడి మన హక్కు! వదులుకోవద్దు!!


గ్యస్ సబ్సిడీని స్వచ్ఛందంగా వొదులుకోవాలన్న భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపును నేను వ్యతిరేకిస్తున్నాను. ఖండిస్తున్నాను.

ప్రపంచ పోలీసులకు లోకమంటే సహజవనరులే!  ఇరాక్ అంటే అమెరికాకు పెటో్రలే! ఇండియా అంటే వాస్కోడిగామాకు మిరియాలు ఏలకులే! వెస్టిండీస్ అంటే కొలంబస్ కి బంగారపు ముద్దే! కృష్ణా గోదావరి బేసిన్ అంటే కార్పొరేట్లకు కోటానుకోట్ల నిక్షేపాలే!

ప్రకృతిలో కలసిపోయి అందులో వనరుల్ని వినియోగించుకుంటూ, పునర్జీవింపజేసుకుంటూ జీవించే మనిషికే ఆ వనరుల మీద అధికారం వుండాలన్నది సహజసూత్రం. ముందు బతుకుదారులకోసం, తరువాత కొత్తమార్కెట్లకోసం యూరోపియన్ల అన్వేషణతోనే ఈ సూత్రం చితికిపోవడం మొదలైంది. వనరులు తరలించుకుపోడానికి సాగిన వలసలే సామా్రజ్యీకరణై యుద్ధాలై, పతనాలై చరిత్రలో కలసిపోయాయి. 

ఇపుడు కనిపించేది వేరు, జరిగేది వేరు అంతర్జాతీయ సదస్సులు, నిర్ణయాలు, తీర్మానాలూ మహా ఉదాత్తంగా కనిపిస్తాయి. ఆవెంటనే బొగ్గుగనులు పరదేశీ కార్పొరేట్ల లీజుకి వెళ్ళిపోతాయి. గ్యాస్ నిక్షేపాలు విదేశీ ఒప్పందాలు కుదుర్చుకున్న అంబానీలకు దాదాదత్తమైపోతాయి. ఇది జులుమో దౌర్జన్యమో లేని హైటెక్  సామా్రజ్యీకరణ. ఇది మనిషి కళ్ళగప్పే ప్రపంచీకరణ. దీని వేగం ప్రపంచ ప్రభువులు తోడుకునే వేగాన్ని బట్టీ, స్ధానిక సామంతుల ఊడిగపు మోజూ, విధేయతలనుబట్టీ, దళారుల దురాశనుబట్టీ వుంటుంది. 

జలవనరులు, అటవీసంపదలు, భూగర్భనిక్షేపాల వినియోగంలో పాలకులు స్ధానిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చివుంటే దేశంలో ఇన్ని ప్రాతీయ అసమానతలు వుండేవికాదు. 

ఓబుళాపురం గనుల గొడవ మనకెందుకులే అన్న ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రిలయెన్సును దారికి తెచ్చుకోడానికైనాగాని ‘ఈ నేలనాదిరా, ఈ గ్యాస్ నాదిరా’ అనే పిలుపునకు దోహదపడ్డారు. వారం రోజులు కూడా సాగని ఈ ఉద్యమంలో నేనూ నినదించాను…ఊరేగాను.

ఆంధ్రప్రదేశ్ అవసరాలు తీరాకే కృష్ణాగోదావరి బేసిన్ లో చమురు, సహజవాయువులను ఇతర చోట్లలో అమ్ముకునేలా రిలయెన్స్ ని శాసించడమే ఆ ఉద్యమ ప్రయోజనం. శాసించడం మాటెలా వున్నా కనీసం ప్రాధేయపడటానికైనా పాలకులకు అందనంత ఎత్తున అంబానీలు వున్నారు.

సహజవనరుల వంటి మౌలిక రంగాలను ప్రయివేటీకరించడమే తప్పు. ఆతప్పు ఇప్పటికే జరిగిపోయింది. కనీసం ప్రయివేటీకరణ ఫలాలను ప్రజలకు నేరుగా అందేలా చూడటమైనా ప్రభుత్వాల వల్ల కావటంలేదు. 

కూరగాయల బండివాడో కిరాణా కొట్టువాడో చిల్లర లేకపోయినా డబ్బుతక్కువైనా ఫర్లేదు రేపివ్వండి సార్ అంటారు. అలాంటి నావాళ్ళకోసం  స్పందిస్తాను. పైసా తక్కువైనా కర్సరే కదలకూడదని కంటికి కనబడకుండా శాసించే హైటెక్ వ్యాపారి తనలాభాల్లో ఎంత తగ్గించుకుంటాడో ప్రకటించగలిగితే నేను కూడా గ్యాస్ సబ్సిడీని రద్దు చేయించుకుంటాను.

ఇప్పటికే కాకుల్ని కొట్టి గ్రద్దలకు వేసేశారు. ఇపుడు కాకుల నోటికందిన కొద్దిపాటి ఇంధనాన్ని కూడా త్యాగం చేయమంటున్నారు. ఇదేమైనా ధర్మంగా వుందా? ఇదేమైనా న్యాయంగా వుందా??

నా పెద్దలు ఇచ్చిన వారసత్వంలాగే నానేల నిక్షేపమైన గేస్ లో కూడా నా వాటా వుంది. అదే సబ్సిడి రూపంలో నాకు అందుతోంది. ఈ హక్కునికూడా త్యాగం పేరుతో లాగేసుకునే వైఖరిని ఏవగించుకుంటున్నాను. 

నేలతల్లి ఇచ్చిన కానుక గ్యాస్ మన ఆంధ్రప్రదేశ్ హక్కు. దీన్ని వదులుకోకూడదని నేను కూడా పిలుపు ఇస్తున్నాను.

నాకూ, మీకూ, బిజెపి సానుభూతిపరులకూ తెలుసు. మోదీ గారి పిలుపునకే స్పందన హెచ్చుగా వుంటుందని….మనందరికీ తెలుసు ‘గ్యాస్ సబ్సిడీ ని స్వచ్ఛందంగా వదులుకోవాలన్న పిలుపు’ ఫస్ట్ బెల్లే…మనం కూర్చున్న కుర్చీ మనకి తెలియకుండానే మాయమైపోయేటంత చల్లగా…మూడోగంట మోగాక మనకి తెలియకుండానే మన సబ్సిడీ రద్దయిపోతుందని…

అయినా కూడా, అప్పటివరకైనా కూర్చునే వుంటాముకదా! ఆలోచించకుండా వుండలేము కదా!!

మరచిపోవద్దు : ఆర్ధిక ఆరోగ్యం పేరుతో ప్రజల హక్కులను త్యాగం చేయాలనడం నియతృత్వం వైపు ప్రయాణించడమే! 

బడ్జెట్ అంటే…విసిగించే అంకెల మాయకార్పొరేట్లపై దయగా వుండటానికి ప్రజలపై నిర్దయ(శనివారం నవీనమ్) 


ప్రజలందరి గౌరవప్రదమైన మనుగడకు, సామాజికంగా ఆర్ధికంగా మెరుగైన జీవనానికి దోహదపడేలా సహజవనరుల్ని, మానవవనరుల్ని వినియోగించుకునే బడ్జెట్టు ఆంధ్రప్రదేశ్ తో సహా దేశంలో ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల సాముదాయిక సంపదను అతికొద్దిమందికి మళ్ళించడమే ప్రభుత్వాల పనైపోయింది. రైతు ఇష్టంతో పనిలేకుండానే వారిభూములు స్వాధీనం చేసుకునే ఆర్డినెన్స్ తో బిజెపి ప్రాధాన్యత ఏమిటో దేశానికి అర్ధమైపోయాక కేంద్ర బడ్జెట్ మీద ఆసక్తి ఏముంది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి లాండ్ పూలింగ్ విధానం వినడానికి బాగున్నా దాన్ని చట్టబద్దం చేయనపుడు తెలుగుదేశాన్ని నమ్మడమెలాగ? విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక ప్రతిపత్తి అని వెన్నపూత పూసిన బిజెపి అధికారంలోకి వచ్చి ఏడాది గడవక ముందే అదేమీ కుదరదు అన్నట్టే ల్యాండ్ పూలింగ్ హమీలను తదుపరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కృష్ణానదిలో పాతిపెట్టవన్న నమ్మకం ఏమిటి???

బతకగలిగిన వాడే బతుకుతాడు, లేనివాడు అణగారి నశిస్తాడు…అనేది జీవపరిణామంలో నిజమే…మనుషుల విషయంలో ఇది అమానుషం…కొన ఊపిరితో వుండేవారికి నాలుగు మెతుకులు విదిలించి దేశసంపదను కొందరికే కట్టబెట్టే సరళీకృత వ్యవస్ధలో ఉదారవిధానాలంటే కఠినాతి కఠినమైన విధానాలే…అందుకే కొన్నేళ్ళుగా దేశవ్యాప్తంగా బడ్జెట్టులన్నీ కఠినంగానే వుంటున్నాయి.

కాకుల్ని కొట్టి గ్రద్దలకు వేయడమే, కార్పొరేట్లపై దయగా వుండటానికి ప్రజలపై నిర్దయగా వుండటమే కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో తెలుగుదేశం విధానాలని ముందుగానే బయటపడిపోయాక, ఇక ఆ ప్రభుత్వాల బడ్జెట్టుల మీద ఆశా, ఆసక్తీ లేకుండా పోయాయి. హృదయం లేని బడ్జెట్ అంకెల్లో పారదర్శకత కూడా లేకపోవడం మరో విషాదం.

ఒకపక్క లక్షా 13 వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ పరుస్తూ కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకుగానీ, అధికారంలోకొచ్చాక కురిపించిన వరాలకుగానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2015-16 ఆర్థిక సంవత్సరం కోసం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చోటివ్వలేకపోయారు.

అదనపు పన్నుల భారాన్ని మోపడం లేదంటూనే…వచ్చే ఏడాదిలో పన్నుల ద్వారా అదనంగా రూ. 7,000 కోట్లు వస్తుందని యనమల అంచనావేస్తున్నారు. ఈ అదనపు ఆదాయాన్ని రాబట్టడానికి ‘ఇతర మార్గాలు అన్వేషిస్తామ’నడం తప్ప ఏం చేయదల్చుకున్నదీ ఆయన చెప్పలేదు. పన్నుల రూపంలో మొత్తం రూ. 44,432 కోట్లు వస్తుందంటూనే వ్యాట్ పద్దులో రూ. 4,000 కోట్లు, స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్ల ద్వారా రూ. 1,000 కోట్లు, యూజర్ చార్జీల ద్వారా రూ. 500 కోట్లు అదనంగా రాగలవని మాత్రం ఆయన చూపారు. ఈ చూపిన మొత్తాలతో కలుపుకుని పన్నులు, చార్జీల ద్వారా మొత్తం రూ. 7,000 కోట్లు అదనపు ఆదాయాన్ని ఆశిస్తూనే కొత్త పన్నులు ఉండబోవని చెప్పడం వంచన తప్ప మరేమీ కాదు.

నిరుడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌కూ, ఇప్పటికీ చంద్రబాబు సర్కారు సాధించిన పురోగతి ఏమైనా ఉంటే అది జనం తలసరి అప్పును అమాంతం పెంచడమే! ముగుస్తున్న ఆర్థిక సంవత్సరానికి అప్పులు రూ. 1,29,264 కోట్లుంటే…వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 17,588 కోట్లు అప్పుతీసుకోనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ అప్పులనైనా ఆస్తుల కల్పనకు ఖర్చుచేసి ఉంటే ప్రజలకు కాస్తయినా ప్రయోజనం ఉండేది. కానీ, ఎక్కువ భాగాన్ని రెవెన్యూ వ్యయానికే ఉపయోగిస్తున్నారు. పర్యవసానంగా పెరిగేవి అప్పులే. వాటిపై కట్టాల్సిన వడ్డీలే. కనుక ఈసారి ద్రవ్యలోటు రూ. 17,584 కోట్లుగా అంచనావేసినా చివరకు అది అంతకన్నా ఎక్కువగా పెరిగే అవకాశం లేకపోలేదు. అప్పులు చేయడంపై విధించిన 14వ ఆర్థిక సంఘం పరిమితులను కూడా మించిపోవడమంటే వ్యయంపై ప్రభుత్వానికి అదుపు లేకపోవడమే.

రైతుల రుణమాఫీ విషయంలో ఏదో అమలు చేస్తున్నామన్న భ్రమలు కల్పించడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం…డ్వాక్రా రుణాల విషయంలో ఆ మాత్రం కూడా మాట్లాడటం లేదు. ఆ ఊసెత్తకుండా దాని స్థానంలో రివాల్వింగ్ ఫండ్‌ను ఏర్పాటుచేయబోతున్నట్టు ప్రకటించింది. అసలు డ్వాక్రా రుణమాఫీ విషయంలో నియమించిన కమిటీ నివేదిక ఏమైందన్నది కూడా చెప్పలేదంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చేనేత రుణమాఫీ కూడా డిటోయే. చేనేత రుణమాఫీకి రూ. 168 కోట్లు అవసరమని అంచనా వేస్తే అందుకోసం కేటాయించిన మొత్తం అత్యంత స్వల్పం. ఇక చేనేత కార్మికులకు రూ. 1,000 కోట్లతో నిధి హామీ ఎటుపోయిందో తెలియదు.

ఇవి అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల దుస్థితి. అధికారానికొచ్చాక ఇచ్చిన హామీల పరిస్థితి కూడా అంతంతమాత్రమేనని బడ్జెట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాజధాని నిర్మాణం కోసమని భూ సమీకరణ కింద రైతులనుంచి ‘స్వచ్ఛందంగా’ 33,000 ఎకరాలు తీసుకున్నామని ప్రకటించినా వారికివ్వాల్సిన నష్టపరిహారం కోసం చేసిన కేటాయింపు రూ. 60 కోట్లు మాత్రమే! ఒకపక్క అంతర్జాతీయ శ్రేణి రాజధాని నిర్మాణం చేస్తామని ప్రకటనలిస్తూ అందుకోసం కేటాయించింది రూ. 303 కోట్లు! తమ నిర్వాకమే ఇలావుంటే రాజధాని నిర్మాణానికి కేంద్రాన్ని అడగడం, సాధించడం సాధ్యమవుతుందా?!

వర్షాభావ పరిస్థితులనూ, హుద్‌హుద్ తుపానువంటి విలయాన్ని ఎదుర్కొని కూడా 5.9 శాతం వృద్ధిని నమోదుచేసిన వ్యవసాయరంగంపై ప్రభుత్వం శీతకన్నేసింది. శుక్రవారం రూ. 14,184 కోట్లతో ప్రవేశపెట్టిన వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్‌లో అధిక భాగం ప్రణాళికేతర వ్యయమే ఉంది. అదంతా జీతాలు, ఇతర ఖర్చులకు సరిపోతుంది. ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, ఉపాధి హామీ తదితరాలుండే ప్రణాళికా వ్యయానికి కేటాయింపులు తక్కువున్నాయి. వాస్తవానికి ఎన్నికల ముందు చంద్రబాబు ధరల స్థిరీకరణ కోసమే ప్రత్యేకంగా రూ. 5,000 కోట్లు కేటాయిస్తామన్నారు. ఆ హామీ కాస్తా అటకెక్కిందని ఈ ప్రత్యేక బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది.

ఇక ఉచిత విద్యుత్‌కు రూ. 6,455 కోట్లు అవసరమని విద్యుత్ పంపిణీ సంస్థలు కోరితే అందుకోసం ప్రభుత్వం కేటాయించింది రూ. 3,000 కోట్లు. కనుక ఉచిత విద్యుత్‌కు కోతపడుతుందన్నమాటే!

అంకెల మాయాజాలం వేలకోట్లనుంచి ఊహ కందనంతగా లక్షకోట్లకు పెరిగిపోవడం వల్ల సామాన్యులకు బడ్జెట్ మీద ఆసక్తి అంతరించి బడ్జెట్ మీద విసుగూ అసహనాలూ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలకు కావలసింది కూడా ఇదేనేమో!!!

Blog at WordPress.com.

Up ↑