నోస్టాల్జియా ఒక తియ్యని గాయం!


(గోదావరి జనం యాస, జీవితం ఆత్రేయపురం పరిసరాల లొకేషన్లు ఇందులో

హైలైట్ మిగిలిందంతా హ్యూమన్ ఎమోషన్లే!)

దట్టించి, కిక్కిరిసి జీవితాన్ని కమ్ముకున్న కాలం తిరుగుతున్నట్టు కాక కాలిపోతున్నట్టు వుంది. తాతలు తండ్రులు పిల్లలకు బతుకు ఇచ్చిన ఊరిలాగ, ఊరి చెరువులాగ, పంటచేను లాగ, ఎడ్లబండిలాగ, మనుషుల మూలాలు, జీవితాల వేర్లు దగ్ధమైపోతున్నట్టు వుంది.

నేలమీద కాలిజాడలనే పడనివ్వని పరుగులో ఎన్ని సహజమైన ఆందాలను, అయినవారి మధ్య బంధాలను కోల్పోతున్నామో అనుకున్నపుడు నిట్టూర్పే మిగులుతుంది.

ఏది పోయిందో ఏది పోబోతోందో తెలియనివ్వని ఆధునిక మాయలో కొట్టుకుపోతున్న తరాలను చూస్తూ మనిషిలో గూడుకట్టుకున్న బెంగ కూడా ఒక తియ్యని గాయమే అవుతుందని ”శతమానం భవతి” చూశాక అనుభవమౌతుంది.

గతించిన కాలం మిగిల్చిన దుఖం కూడా ఒక ఉద్వేగభరితమైన ఆనందాన్ని ఇస్తుందని ”శతమానం భవతి” చూశాక అనుభవంలోకి వస్తుంది.

కుదిరితే మీరు కూడా #ZEEసినిమాలు లో వస్తున్న ఈ సినిమా చూడండి! బాగుంటుంది.

మమ్మీ చంపేసిన అమ్మ భాష బతుకుతుందా? (విజయవాడలో ప్రపంచ తెలుగు మహా సభల సందర్భం)


భాషంటే అది మాట్లాడే ప్రజలు, వారి సంస్కృతీ, చరిత్రా….అవి ధ్వంసమయ్యాక భాష ఒక్కటే బతికి వుండటం సాధ్యం కాదు. (అమ్మని మమ్మీ నాన్నని డాడీ చంపేసినట్టు)

* భాషను జనం మాటగా మార్చి గిడుగురామ్మూర్తి పంతులుగారు తెలుగుకి వందేళ్ళు ఊపిరిపోశారు…

* ప్రపంచవ్యాపతంగా మరణిస్తున్న సగంభాషల్లో అనేక పరిణామాలవల్ల తెలుగు కూడా చేరిపోయింది

* యునెస్కో నివేదిక ప్రకారం 2025 నాటికి మనదేశంలో హిందీ బెంగాలీ మరాఠీ తమిళం మళయాళ భాషలు మాత్రమే వుంటాయి

* తెలుగు మాయమైపోతూండటం విచారకరమే అయినా ఇదొక పరిణామక్రమంగా స్వీకరిస్తున్నాను

* ఉన్నత రాజకీయాధికారంలో వున్నవారిలో మండలి బుద్ధప్రసాద్ గారికితప్ప ఎవరికీ తెలుగు పట్ల ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులు లేవు…ఇందువల్ల తెలుగుని ఉద్ధరించేస్తామనే నాయకుల మాటలు మనకి వినబడవు…ఒక వేళ ఎవరైనా అలా చెబితే అవి దొంగమాటలే అని మరో ఆలోచనలేకుండా అనేసుకోవచ్చు.

* ప్రపంచంలో ఏమతమైనా తనను తాను ప్రచారం చేసుకోడానికి ప్రజల భాషను ఆశ్రయిస్తే మన వైదీకం జనం భాషకు దూరమై రహస్యంగా వుండిపోయింది

* సంసృ్కతాన్ని పక్కన పెట్టి గౌతమబుద్ధుడు, మహావీరుడు ప్రజలభాష “పాళీ”లో చేసిన బోధనలు శరవేగంతో దేశాన్ని చుట్టుముట్టాయి

* పండితుల సంస్కృత భారతాన్ని వందల ఏళ్ళతరువాతే నన్నయ తెలుగునేల మీదకు తీసుకురాగలిగారు

* తెలుగుదేశాన్ని ఎవరుపాలించినా సంస్కృతమో, పారశీకమో, ఊర్దోనో, ఇంగ్లీషో పాలకుల భాషగావుండిపోయాయి

* ఉద్యోగాలు కేంద్ర బిందువులై నైజాములో ఉర్దూ, ఆంధ్రాలో ఇంగ్లీషూ తెలుగుని టెలుగూ గా మార్చేశాయి

* తెలుగుకోసం ఉద్యమాలు చేసి రాషా్ట్రలు సాధించిన తెలుగువాడు కూర్చున్న కొమ్మను తానే నరికేసుకుంటున్నాడు

* ఇంగ్లీషువాళ్ళు , నిజాం స్కూళ్ళవరకూ తెలుగుని అనుమతించారు తెలుగువాడు తల్లఒడిలోనే మాతృభాషను తన్నేస్తున్నాడు

* మెకాలే ఊహలోనే లేని ఉగ్గుపాల నుంచే ఎబిసిడిలను అడుగులు పడనపుడే ఐఐటి కోచింగ్ లను తెలుగువాడు మోహిస్తున్నాడు

* ఉద్యోగాలు ఇస్తున్నపుడు, తల్లిదండ్రులే చదివించుకుంటున్నపుకు ఇంగ్లీషంటే నొప్పి ఎందుకని సుప్రీం కోర్టే ప్రశ్నిస్తోంది

* పక్కదారులనుంచి దేశంలో దూరిన బ్రిటీష్ వాడిని తరిమేసిన ఉద్యమ విలువలు అమెరికావాడికి ఎస్ బాస్ అనేలా తిరగబడ్డాక మాతృభాషకు చోటెక్కడ?

* మార్కెట్టే జీవిత సర్వస్వమైపోయాక డాలర్ గరగరలు తప్ప తెలుగు నాణాలు మోగుతాయా

* ఆత్మనే అమ్మకుకున్నాక అమ్మ భాష మీద మమకారముంటుందా?

* మాతృభూమిని ప్రేమించకుండా మాతృభాషను కాపాడుకోవడం కుదురుతుందా?

పనిసంస్కృతి లో సంతృప్తికి ఒక ప్రతీక దగ్గుబాటి రామానాయుడు గారు!


నాకు సినిమాల మీద తప్ప సినిమా వాళ్ళ మీద ఆసక్తి లేదు. అందువల్లే నాకు అవకాశాలు వున్నాకూడా సినిమా రంగంవాళ్ళు తారసపడినపుడు వెనక్కివెళ్ళిపోతూంటాను.

రామానాయుడు గారితో నాకు ‘గట్టి’ పరిచయమే వుంది. గన్ని కృష్ణగారు , మధుఫోమా్రగారితోపాటు ఆరోజు నేను కూడా పార్లమెంటులో వున్నాను. నేను అక్కడ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుతో మాట్లాడుతున్నప్పుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు వచ్చి మేము వెంకయ్య నాయుడు రూంలో వుంటాము నువ్వు అక్కడికి రా అని ఆఇద్దరితో వెళ్ళిపోయారు. నేను ఆరూమ్ కి వెళ్ళాక రామానాయుడుగారు అక్కడికి వచ్చారు. ఆయన చేతిలో లావుపాటి బౌండ్ బుక్కులు నాలుగు వున్నాయి. వాటికి టేబుల్ మీద పెడుతున్నపుడు ఒకటి జారి పడింది. నేను నేను తీసి ఇచ్చాను.

మండలాలవారీగా నా నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారమార్గాలు ఇందులో వున్నాయి. శాంక్షన్ల కోసం వీటిని పట్టుకుని తిరుగుతున్నాను. అవట్లేదు. సినిమా వాడిగా వున్నపుడే మెరుగు. అడిగితే పనులు చేసిపెట్టేవారు అని రామానాయుడు నవ్వుతూ చెప్పారు.

మీ కింకా గవర్నమెంటుతో పనులు చేయించే పట్టు దొరకలేదని యార్లగడ్డ కామెంటు చేశారు. ఇలా సంభాషణలు జరుగుతున్నపుడే టపాకాయలు కాలుస్తున్న చప్పుడు. ఎందుకో అర్ధంకాలేదు. అపుడు టివిలో వార్తల్ని బట్టి పార్లమెంటులో తీవ్రవాదులు జొరబడ్డారని పోలీసులకు వారికీ ఎదురు కాల్పులు జరుగుతున్నాయని అర్ధమైంది. మేమున్న విపత్కర పరిస్ధితిలో తీవ్రత అపుడు మాకు తెలియదు.

రామానాయుడుగారు డిస్కంఫర్ట్ ఫీలవుతున్నారు. గన్ని కృష్ణ, యార్లగడ్డ గార్ల సూచన ప్రకారం ఆయన షర్టువిప్పేశారు. మేము అక్కడున్న వెడల్పయిన టేకు బెంచీని ఫాన్ కిందకు జరిపాము. బనియన్ తో కాసేపు దానిమీద పడుకున్నాక ఆయన తేరుకున్నారు. రెండు గంటల తరువాత ఆయన్ని సాయంత్రానికి మమ్మల్నీ సెక్యూరిటీ వాళ్ళు క్షేమంగా పంపించేశారు.

తరువాత చాలాకాలానికి ప్రమోద్ మహాజన్ రాకసందర్భంగా హైదరాబాద్ లో ఒక లంచ్ ఏర్పాటైంది. అందులో నేనూ వున్నాను. రామానాయుడుగారే నన్ను పలకరించారు. మా సంభాషణల్లో ‘సినిమాలూ జర్నలిజమూ బాగోలేవు పాలిటిక్స్ అస్సలు బాగోలేవు’ అన్నారు.

సినిమాలని మీరు రిపేర్ చేయగలరు అన్నాను. వరదని ఏ మనిషో ఆపగలడా అని ప్రశ్న వేశారు.

ఎస్టాబ్లిష్ మెంట్లు పెరిగిపోయాయి. వాటిని మెయింటెయిన్ చేయ్యాలంటే ఏక్టివిటీ ఆగకూడదు. ఈప్రాసెస్ లో మేము కంఫర్ట్ బుల్ గా వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా జీవిస్తున్నారు ఇదే సాటిస్ ఫాక్షన్ అన్నారు.

ఫలితాలు ఎలావున్నా అంకితమైన భావంతో పనిచేయలన్న భారతీయతత్వానికీ, పనిసంస్కృతిలో సంతృప్తికీ ఒక ప్రతీక దగ్గుబాటి రామానాయుడుగారు ఒక ప్రతీక.

ఏ మనిషికైనా ఆ సంతృప్తి ఎంత అమూల్యమో నిన్నా ఇవాళా టివిల్లో కనబడుతోంది.