నిజమైన పుణ్యక్షేత్రం!!


రాజహంసలు, గూడబాతులు, మంచు కొంగలు…పేరు ఏదైనా కాని సైబీరియా నుంచి వచ్చే పక్షులకు పుట్టింటి వారి వలె పురుడుపోసి తల్లీబడ్డల్ని అల్లుడినీ భద్రంగా సాగనంపే “పుణ్యక్షేత్రం” 5-8-2018 ఆదివారం నాడు మరోసారి దర్శనమైంది.

ఆహారమైన క్రిమి కీటకాలవేటలో రాత్రంతా షికార్లు చేసి పగటిపూట తల్లకిందులుగా వేలాడుతూ నిద్రపోయే గబ్బిలాలకు గూడై నిల్చిన “రాధేయపాలెం” చెట్టుని ఆవెంటనే దర్శించుకున్నాము. 

ఇదంతా రాజమండ్రికి 20 కిలోమీటర్లలోపు దూరంలోనే! గ్రేకలర్ ముక్కు, మచ్చలు వున్న తెల్లకొంగలు జంటలు జంటలుగా జూన్ జులై ఆగస్టునెలల్లో సైబీరియా నుంచివస్తాయి. పుల్లా, పుడకా ముక్కున కరచి, పదిలపరచుకుని, సురక్షితమైన స్ధావరాల్లో గూడుకట్టుకుంటాయి. గుడ్డుపెట్టిన కొంగ దాన్ని పొదిగి పిల్లను చేసే వరకూ మగకొంగ మేతను ఏరుకు వస్తుంది. పిల్లకు రెక్కలు బలపడి ఎగరడం నేర్చుకునే వరకూ తండ్రి కొంగ గూడులోనే వుండి పిల్లను కాపాడుకుంటుంది. తల్లికొంగ మేతను ఏరుకొచ్చి తండ్రీబిడ్డల కడుపునింపుతుంది. రెక్కలొచ్చిన బిడ్డలు, తల్లిదండ్రులూ డిసెంబర్ జనవరి నెలలలో వెళ్ళిపోతాయి.

కుటుంబ బాధ్యతల్లో పనివిభజనకు ఇంతకంటే మరొక రోల్ మోడల్ వుండదు.

చిన్నపాటి అలికిడికే బెదరిపోయే మూగజీవులు పుణ్యక్షేత్రం గ్రామం చెరువు చుట్టూ గట్టంతావున్న చెట్లనిండా సైబీరియానుంచి వచ్చే పక్షుల గూళ్ళు కట్టుకుంటున్నాయంటే ఈ ఊరి జనం మీద ఆ పక్షుల నమ్మకానికి భరోసాకి ఆశ్చర్యమనిపిస్తుంది. పక్షులను వేటాడే వారిని ఊరినుంచి పంపివేయడం పుణ్యక్షేత్రంలో తరతరాల సాంప్రదాయం. గుడ్లు పొదగడానికి సరైన శీతోష్ణాలు, పౌష్టికాహారాలు లభించడంతో పాటు వాటిని కాపాడుకునే ఊరి కట్టుబాటూ, పుణ్యక్షేత్రాన్ని సైబీరియా కొంగలకు పుట్టిల్లుగా మార్చేసింది.

ఇదంతా పత్రికలలో, టివిలలో చాలాసార్లు వచ్చింది. నేనుకూడా స్యూస్ ఫీచర్ గా ఈనాడులో, ఈటివిలో, జెమినిటివిలో ప్రెజెంట్ చేశాను. మోతుబరి బొప్పన బ్రహ్మాజీరావుగారు, డాక్టర్ గన్నిభాస్కరరావుగారితో కలిసి లోకసంచారం చేస్తున్నపుడు, ఆ గ్రామంలో డాక్టర్ గారికి ఇదంతా వివరించాను. ఆయన స్వయంగా ఫొటోలు తీశారు.

బ్రహ్మాజీ గారు గబ్బిలాల చెట్టుగురించి గురించి చెప్పగా చక్రద్వారబంధం రోడ్డులో వున్న రాధేయపాలెం దారిపట్టాము. ఊరికి ముందుగానే వున్న చెట్టుకి నల్లతోరణాలు వెలాడుతున్నట్టు నిద్రపోతున్న గబ్బిలాలు కనిపించాయి.

ఈ రెండు సన్నివేశాలలో పుణ్యక్షేత్రం, రాధేయపాలెం గ్రామాల వారి భూతదయ, జీవకారుణ్యం కనిపిస్తున్నాయి.

ఈ సంచారంలో – లోకమే శబ్ధసంగీతాల మయం అని నాకు అర్ధమైంది. దోమలు, తేనెటీగలు, వడ్రంగిపిట్టలు, చిలుకలు, పావురాలు, కాకులు, పక్షులు…నడిచే – పాకే – ఎగిరే క్రిమికీటకాలు, జీవుల పాటల్ని వినగలిగితే మన చెవులు, శరీరం, మనసూ ఆలకించగలదని అనుభవమైనట్టు కొన్ని క్షణాలు అనిపించింది.

కీటకాల, పక్షుల, పిట్టల ప్రతీ కదలిక, ఆట, వేట, ఒరిపిడి, రోదన, సంతోషం, ఆనందాల్లో ఒక లయవుంటుందని, ఆ లయ నుంచే సంగీతం పుట్టుకొచ్చిందని అర్ధమైంది.

జనంరొదలేని ప్రశాంతతలోనే లయ వినపడుతుంది. అది అబలలైన మూగజీవాలక ఆ లయే భరోసా ఇస్తుంది. ప్రకృతి తన సృష్టి ని తాను కాపాడుకోవడం ఇదే! రాధేయపాలెం, పుణ్యక్షేత్రాల మహిమ ఇదే!!

– పెద్దాడ నవీన్

జీవనశూన్యంలో నైతికతను వొంపే తీర్ధయాత్ర! 


మూఢభక్తితోకానీ, చేసినతప్పులన్నీ రద్దయిపోతాయన్న అత్యాశ వల్లగానీ, ఓ సారి చూసివద్దాం అన్న కుతూహలం వల్లగానీ, అవవాటుగా పెరుగుతున్న యాత్రావినోదంగాకానీ, ప్రజల్లో ఆలయాల సందర్శన పెరుగుతూవుంది. ఇవాళ అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఆలయ సందర్శన తో సహా కొంతకాలంగా కుటుంబసమేతంగా నేను చేస్తున్న తీర్ధయాత్రల్లో చాలా విషయాలు గ్రహిస్తున్నాను.

జీవితాన్ని ఆక్రమించుకుంటున్న శూన్యాన్ని పుణ్యక్షేతా్రలు, తీర్ధయాత్రలూ నింపుతున్నట్టున్నాయి. దర్శనాలు, పూజా క్రతువుల ద్వారా ఒక నిబద్ధతను, ధార్మిక ప్రసంగాల వల్ల ఒక ప్రాతిపదికను, ఆధ్యాత్మిక భావాల వల్ల తాపత్రయాలు వీలైనంత వొదిలించుకోవాలన్న తాత్వికతనూ, ఎంతోకొంత ప్రజలు నింపుకుంటున్నారు. నిజానికి ఇవన్నీ ఎంతో కొంత భారతీయ సమాజపు భావజాలంలోనే వున్నాయి. 
తరం నుంచి మరో తరానికి ఈ భావాలను రీఇన్ ఫోర్స్ చేసుకోవడమే తీర్ధయాత్రల రద్దీ పెరగడానికి మూలం. గ్రామాల్లో ఆలయాలు ప్రత్యక్షంగా సంఘజీవనాన్ని పటిష్టం చేయడంతోపాటు ఊరి ఆరోగ్య సంరక్షణకు ప్రాధమిక కేంద్రాలుగా కూడా వుండేవి. ఇపుడు గ్రామాలు అంతరించిపోతున్నాయి. సమాచార, రవాణా వసతులు పెరిగే గ్లోబల్ వాతావరణం కళ్ళముందుకి వచ్చేసింది. చిన్నా చితకా అంతరించిపోయి మెగావే మిగలడం గ్లోబల్ లక్షణమే. ఆప్రకారమే సింహాచలం, అన్నవరం, విజయవాడ, శ్రీశైలం, తిరుమల లాంటి ”పెద్ద” ఆలయాలు చేసుకున్న పుణ్యం అంతా ఇంతాకాదు. బస్సులు, కార్లు, రైళ్ళు, విమానాలకు ప్రజల్ని ఈ ప్రాంతాలకు చేర్చడం మీదుండే ఇంటె్రస్టు అంతా ఇంతాకాదు. 
ఏమైతేనేమి పూజాక్రతువులనుంచి, ధార్మిక ఆలోచనలనుంచి, ఆధ్యాత్మిక చింతనల నుంచీ ప్రజలు భక్తి భావాలకంటే జీవితాల్లో నైతికతను నింపుకుంటున్నారనీ, నైతిక బలాన్ని సుసంపన్నం చేసుకుంటున్నారనీ అర్ధమౌతోంది. ప్రపంచాన్ని పరిచయం చేసుకోడానికి క్షణక్షణం అవకాశమున్న కమ్యూనికేషన్ యుగంలో మనుషుల అవగాహనలకు హేతుబద్దతే ప్రాతిపదిక కావడంలో ఆశ్చర్యం లేదు. ఆర్జిత సేవల విషయంలో సిబ్బందినీ అర్చకుల్నీ ప్రశ్నించే లక్షణం బాగా పెరిగింది. చెల్లించిన సేవలపై నిలదీయడనికి అది వారికి డబ్బు ఇచ్చిన ధీమా! 
ఎన్ని అసౌకర్యాలనైనా ఓర్చుకుని సహించే దిగువమధ్య తరగతివారు సర్వదర్శనం క్యూలలో అవసరమైతే ఎవరినైనా నిలదీయడానికి సంకొచించని నిర్మొహమాట స్వభావం ”ప్రశ్నించే” అలవాటు పెరుగుతోందనడానికి ఒక సంకేతం. బ్యాలెట్ బాక్సుల్లో ఈ ”ప్రశ్నలే” ఫలితాల అంచనాలను తారుమారు చేసేవని అర్ధంచేసుకోవచ్చు. 
ఆలయాలకు సకుటుంబాలుగా వచ్చే యాత్రికుల్లో చాలా సందర్భాల్లో టూర్ మేనేజర్లు ఆ ఇంటి గృహిణులు కూతుర్లు కోడళ్ళే. ఇది స్త్రీ స్వాభావికమైన మేనేజీరియల్ స్కిల్లే. 
ఇవన్నీ పక్కనపెట్టేయండి…రాశులుపోసినట్టు వుండే మనుషుల జీవన సౌందర్యం తీర్ధయాత్రల్లో తప్ప, ఆలయ సందర్శనల్లోతప్ప ఇంకెక్్కడ కనబడుతుంది? అసలు మనుషుల్ని మించిన దేవతలూ, దేవుళ్ళూ ఇంకెవరున్నారు? అందుకే దీన్నొక బ్రాండుగా, ఐకాన్ గా ”ముక్కోటి దేవతలు”అన్నారు.

మనలో మనమే మాట్లాడుకునే ఉద్వేగపు భాష – ప్రయాణం


కోరుకొండ, గోకవరం, సీతపల్లి, రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు, ప్రాంతాల గిరిజనుల వేషధారణలో పెద్దమార్పు వచ్చింది. అబ్బాయులు జీన్ పాంట్లు, రెడీ మేడ్ షర్టుల్లో, అమ్మాయిలు వదులు వదులు పంజాబీ డ్రెస్సుల్లో గాగ్రాల్లో, అక్కడక్కడా లెగ్గింగ్స్ లో కనిపించారు. యువతీయువకుల మొహాల్లో బండతనం అంతరించి నున్నగా నాజూగ్గావున్నయి. టివిడిష్ లు మోటారు బైకులు విరివిగా కనిపించాయి. చవకైన రెడిమేడ్ దుస్తుల దుకాణాలు కూడావున్నాయి.

ఫిబ్రవరి 6, 2015 శుక్రవారం ఉదయం పదకొండున్నరకు రాజమండ్రిలో బయలుదేరి భద్రాచలం చేరుకునే వరకూ రోడ్డుకి ఇరువైపులా గమనించిన విశేషాలు ఇవి. డాక్టర్ గన్ని భాస్కరరావుగారి కారులో వారితోపాటు ఈ ప్రయాణం సాగింది. గోకవరం లో డాక్టర్ బదిరెడ్డి రామారావు గారి ఇంట్లో భోజనం చేసి వారిని కూడా వెంటబెట్టుకుని పన్నెండున్నరకు ప్రయాణం మొదలు పెట్టాము. ఈ ప్రయాణంలో రోడ్డుకి రెండువైపులా గమనించిన విశేషాలు ఇవి.

రోజూకంటే ముందు విందు భోజనం చేయడం వల్ల కునుకుతున్నపుడు ఎసి కారులోని చల్లదనాన్ని చలి ఆక్రమించుకున్నట్టు అనిపించింది. మారేడుమిల్లి జోన్ లో ఎంటరయ్యామని కళ్ళుతెరవకుండానే అర్ధమైంది. శ్రీమతి మణి ఆతిధ్యపు మగత కాసేపు కళ్ళు తెరవనీయలేదు. ఘాట్ రోడ్డుకి వచ్చాక వంపుల ప్రయాణానికి నిద్రతేలిపోయింది.

రోడ్డుని డబుల్ రోడ్డుగా విస్తరించారు. రోడ్డు బాగుంది. పనిచేస్తూ రెండు బుల్ డోజర్లు కనిపించాయి. పాతవాటిలా కాకుండా కాంపాక్టుగా వున్నాయు. రోలర్ లకు వైబ్రేషన్ వుంటటం వల్ల కంకర, ఇసుక, తారు ఖాళీలు లేకుండా సర్దుకుని సాలిడ్ రోడ్ అవుతుంది.

కొండవాలులు సరే చదునైన నేలలో ఎక్కడోగాని సారవంతమైన భూములు లేవు. జొన్న, బుడమ వొడ్లు లాంటి పైర్లు పలచగా కనిపించాయి. పొడిపారినట్టున్న ఎర్రమన్ను నేలమీద నానారకాల అడవి చెట్లు మొక్కలు పొదలు నల్లటి షేడ్లతో ముదురు ఆకుపచ్చ రంగులో గిడసబారిపోయినట్టు వున్నాయి. మనుషులేకాదు కుక్కలు, మేకలు, ఆవులు, ఎద్దులు కూడా సౌష్టవంగా లేవు. అలాగని బక్కచిక్కిపోయి కూడా లేవు. మొత్తం ఆప్రాంతపు జీవ చైతన్యంలోనే ఒక లాంటి గిడసబారినతనం వున్నట్టు అనిపించింది. జాళ్ళు అక్కడక్కడా గుంతల్లో పేరుకున్న కుళ్ళునీళ్ళు తప్ప పాములేరు, నాగులేరుల్లో ప్రవాహాలు లేవు. శబరినది మాత్రం మందమైన ప్రవాహంతో నిండుగా వుంది

చింతూరులో టీ తాగడానికి ఆగాము. ఒకప్పుడు వ్యాపారాలన్నీ గిరిజనేతరులవే..గిరిజనులు కూడా స్వయంగా వ్యాపారాలు చేసుకోవడం ప్రారంభమైంది. గిరిజనేతరుల వ్యాపారాల్లో పనిచేసే గిరిజనుల సంఖ్య పెరిగింది. అన్నిటికి మించి ఇరువురి మధ్యా ఆధిపత్య, పరాధీన భావనల్లో చనువు స్నేహభావాలు పెరిగాయి. ఒక గిరిజన యువకుడి (మొహం చూస్తే తెలిసిపోతుంది) టీదుకాణం ముందు నుంచుని పరిసరాలను పరిశీలించినపుడు ఇదంతా అవగతమైంది. ఆయువకుడు ఒక చెవికి పోగుపెట్టుకున్నాడు. ఫాషనా? మీ ఆచారమా అని అడిగితే ఫాషనే అన్నాడు. మూకుడులో వడల పిండి వేసేటప్పుడు ఆయువకుడు చెయ్యితిప్పడం ఒక నాట్య విన్యాసమంత కళాత్మకంగా కష్టంగా వుంది.

భద్రాచలం పట్టణంలో ప్రవేశించాక ఎడమవైపు కనిపించిన ‘తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ ప్రయాణ ప్రాంగణం భద్రాచలం’…బోర్డు చూడగానే ఒక అనుబంధపు నరం మెలితిరిగినట్టు అనిపించింది. రాష్ట్రవిభజన తరువాత తెలంగాణాలోకి వెళ్ళడం ఇదే మొదటిసారి. ఊరి చివర పొలంలో వున్న మూర్తిరాజు గారి మకాం లోకి వెళ్ళి కాఫీ తాగుతూ తెలంగాణా లో ఎలావుంది పాలనబాగుందా అని అడిగినపుడు టౌను తెలంగాణా కిలోమీటరు లోపువున్న ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు.

అక్కడినుంచి ఆలయదర్శనం..నా మిత్రులు ప్రముఖులు కావడం మూలాన మేము క్యూలో వేచివుండకుండా నేరుగా గర్భగడిలోకి వెళ్ళే సదుపాయాన్ని స్ధానికులు కల్పించారు. గోత్రనామాలతో అర్చనలు చేయించుకున్నాము.

స్ధల, కాలాల పరిధిని దాటి అనంతంగా జీవించే స్మృతే దేవుడు…వందల తరాల తరువాత కూడా కొనసాగే ఎమోషనే భక్తి… సీత, లక్ష్మణ, హనుమంతుల తోడుగా రాముడు ఈ మాటే చెప్పాడనిపించింది ఏ పటాటోపమూ లేకపోవడం వల్లనేమో ఈయన ఫ్రెండ్లీ దేవుడయ్యాడని బోధపడింది. కాసేపైనా ఒక అలౌకిక ప్రశాంతత ఏప్రార్ధనా మందిరంలో అయినా వుంటుంది. గుడి, చర్చి, మసీదు ప్రతీచోటా ఇలాగేవుంటుంది. పోనీ దీన్నేదేవుడి మహిమ అనుకుందాం!

దారిలో “తానీషా కల్యాణ మండపం” ఓక్షణం గగుర్పరచిన మత సామరస్యపు స్ఫూర్తి అయింది. షాదీఖానాను కాకుండా ఓసంపన్నులైన నవాబుగారు కొన్నేళ్ళ క్రితమే ఈ కల్యాణ మండపాన్ని కట్టించారట!

టూరిజం హొటల్ లో చిన్నస్వామి రాజు గారి కి 84 వపుట్టిన రోజు అభినందన కార్యక్రమం. మేము వెళ్ళింది వారికి శుభాకాంక్షలు చెప్పడానికే…బుకేలు అందించి అడవిలో ఘాట్ లో ప్రయాణించవలసి వుందన్న వాస్తవాన్ని నైస్ గా మా హోస్టుల చెవిన వేసి కారెక్కేశాము.

మెలికలు తిరిగిన ఘాట్ రోడ్ లో ముందు ఎలాంటి రోడ్ వొంపు వుందో డ్రైవర్ కి తెలియడం ముఖ్యంగా రాత్రివేళ ఎంతైనా వుపయోగం సురక్షితమైన ప్రయాణానికి అదే దోహదకారి అవుతుంది. విశాలమైన బిఎం డబ్లూ్య – ఎస్ యువి కారు విశాలమైన డాష్ బోర్డుమీద జిపిఎస్ నావిగేటర్ ఇలా డ్రైవర్ అబ్బాస్ కి నిరంతరాయంగా దారి చూపిస్తూనే వుంది.

ఉదయం పదకొండున్నరకు రాజమండ్రినుంచి బయలుదేరి రాత్రి పదిన్నరకు ఇలా ఇల్లు చేరుకున్నాము.

సీతపేట కొండమీద దీపాలముగ్గు కనబడింది..గాలికి చెట్టూచెట్టూ రాసుకుని ఎండిన ఆకులు రాజుకుని గాలివీచిన మేరకు తగలబడిపోతూండటం దూరానికి దీపాల హారంలా కనిపిస్తూంది.

ఆకాశం నిర్మలంగా వుంది. పౌర్ణమి తరువాత మూడో రోజు కావడం వల్ల చంద్రుడు పూర్ణబింబమై వున్నాడు. దాదాపు ప్రయాణమంతా ఎడమ కిటికీ నుంచి చూస్తూనే వున్నాను. ఎక్కడోగాని నక్షత్రాలు కనిపించకపోవడంవల్లో, నేనేంటి అడవిగాచిన వెన్నెలనైపోయాను అనుకోవడవల్లో గాని తదియనాటి చంచమామ ఆయన కాస్తఎర్రగా వున్నాడు..

– పెద్దాడ నవీన్

చేతులతో కాదు, చూపులతో పట్టుకోగలిగేదే అందం!


చేతులతో తాకగలిగేది మోహం కావచ్చేమోకాని, చూపులతో పట్టుకోగలిగేదే అందం…అందుకేనేమో నాకు ప్రయాణమంటే పట్టరాని సంబరం…ఎందుకంటే అందమైన అనుభూతులతో తిరిగిరావడం, ఏదో కొత్త జీవ చైతన్యాన్ని ఇంకింపచేసుకోవడం బయటకు వెళ్ళకపోతే కుదరవుకదా?

ద్రాక్షారామ లో వివాహనిశ్చితార్ధానికి తప్పక రావాలని జక్కంపూడి రాజా (దివంగత ప్రజానాయకుడు జక్కంపూడి రామమోహనరావుగారి పెద్దబ్బాయి రాజా ఇంద్ర వందిత్) స్వయంగా పిలిచినపుడే వెళ్ళాలని దాదాపుగా నిర్ణయించుకున్నాను. ఇతిహాసాలమీద మమకారం వల్లో ఏమో ద్రాక్షారామ’మంటేనే లోపల ఒక ఇష్టం మెదులుతుంది మరి.

శివుడి 18 మహా క్షేత్రాల్లో ద్రాక్షారామ ఒకటన్న నమ్మకం వయసు కనీసం 15 వందల సంవత్సరాలయితే, అప్పటి శిల్పకళా వైభవం తూర్పు చాళుక్యుల నాగరికతా, వికాసాలకు ఇప్పటికీ ప్రత్యక్షసాక్షిగా వుందన్న ఆలోచన బాగుంది. అప్పటి సమాజదృశ్యం ఎలా వుండేదో ఊహిద్దామంటే ఎలా ప్రారంభించాలో తట్టలేదు.

కారు కాకినాడ కాల్వరోడ్డులో ప్రయాణిస్తూండగా ‘నీరుపల్లమెరుగు’ అంటే మహాజ్ఞానమని అర్ధమైంది. తెలిసిన విషయాల్ని అన్వయించుకుని జీవితాలను సఫలం చేసుకోవడమే జ్ఞానం. అనుకూల పరిస్ధితులను వెతుక్కుంటూ వలసలో జైత్రయాత్రలో చేసిన వివేకవంతులైన సాహసులవల్లే జాతులు విస్తరించాయి.వికసించాయి. అలా గోదావరి తూర్పుగట్టున తూర్పు చాళుక్యులు కనిపెట్టిన ద్రాక్షారామ కు వెళుతున్నామన్న భావన మరోసారి ఉత్సుకతను రేపింది.

పట్టని/నిండిన చోటునుంచి తొలగిపోడానికి నేలమీద నీరు ఏర్పరచుకున్న జాలు కాలక్రమంలో పశువులకు పుంతై, మనుషులకు దారై వర్షాకాలంలో పెద్ద అసౌకర్యమై, కాటన్ దొర చేతిలో గ్రావిటేషన్ కెనాలై, పర్యవేక్షణా నిర్వహణా యంత్రాంగాలకు రహదారులైన కాలక్రమంలో అందరికీ తార్రోడ్డయిన కాల్వగట్టు మీద గన్నికృష్ణ గారి కారులో ప్రయాణం హుషారనిపించింది.ఆయన అనుచరులు బాలనాగేశ్వరరావు, వెంకటరాజు గార్లు కూడా ఈ ప్రయాణంలో వున్నారు.

నీళ్ళు పచ్చని చెట్లు చాలాచోట్ల కోతలైపోయిన చేలు, ఇటుకల బట్టీలు, కలప అడితులు…దారిపొడవునా ఇవేదృశ్యాలు

నిశ్చితార్ధ వేదిక తూర్పుగోదావరి జిల్లా లో అతిముఖ్యుల తో కిక్కిరిసిపోయింది. రాజాను కలిసి అభినందించి తిరుగుప్రయాణం కాగానే వీరిభోజనాల సంగతి చూడాలని ఒకర్ని పురమాయించారు. మొగమాట పడకండి ‘మాటొచ్చేద్ది’అని ఇంకో పెద్దమనిషి హెచ్చరించారు. ఈజిల్లా యాస, తినకుండా వెళ్ళనిచ్చేదిలేదన్న కటువైన అభిమానం మాటొచ్చేద్ది అనేమాటలో వున్నాయి.

ద్రాక్షారామలో గొప్ప పాకశాస్త్ర ప్రవీణులున్నారు. మాంసాహార వంటకాల్లో వీరి ఖ్యాతి రాష్ట్రమంతటికీ పాకింది. నేను కేవలం శాఖాహారినే. ఏ ఆహారమైనా సరే వంటవారు తమ ప్రతిభను చాటుకోడానికో అత్యుత్సాహంవల్లో రుచులను కలగాపులగంచేసి వంటలు పాడుచేయడం పెరిగిపోతోందన్నది నా అభియోగం. అయితే ఈ వంటలో రుచులను యధాతధంగా వుంచి పండించారు. మొత్తం ఏంబియన్స్ కోసం స్ధానికంగా వున్న వనరులనే తప్ప బయటి వాటిని తెప్పించకపోవడం ఒక విశేషం. గ్రామీణ స్త్రీలలో మేకప్/మేకోవర్ , గ్రామీణ పురుషులలో ఖరీదుల్ని చూపుకోవాలన్న సృ్పహలు బాగా పెరిగాయని వందలమంది హాజరైన ఈ వేడుకలో అర్ధమైంది.

మధ్యతరగతి వర్గాల కొనుగోలు శక్తులు పెరగి కార్లు పెరగడం వల్ల కూడా రామచంద్రాపురం డివిజన్ లో సింగిల్ రోడ్లు ఇరుకై టా్రఫిక్ జాములు తప్పడంలేదు. రోడ్డు వైడనింగ్ కూడా అక్కడక్కడా జరుగుతూనే వుంది.

రామచంద్రాపురంలో గమ్మత్తయిన రుచితో కిళ్ళీలు చుట్టే శ్రీరాజాపాన్ షాప్ ఏసీనూలేనంత నిరాడంబరంగావుంది. ఊరినే పేరులో ఇముడ్చుకున్న తాపేశ్వరం కాజా దొరికే ‘సురుచి’ వ్యాపార వైభవం దాయాదిపోరులో ఏనాడో జయించింది.

వీటన్నిటికీ మించి నీలిశూన్యంలో పరిమళాలు అల్లుతున్న గాలి నన్నుతాకడం గొప్ప అనుభవం…ఒక్కడినే అయిన నాలో వున్న నీటినీ,నేలనీ,గాలినీ,నిప్పునీ, ఆకాశాన్నీ…మూడుగదుల ఇల్లుదాటి స్వచ్ఛమైన ఒక ‘స్పేస్’లోకి రాగానే పంచభూతాలు పలకరించడమే నా ఆనందోద్వేగమనీ అనుభవయ్యింది.

రాజా పెళ్ళినిశ్చితార్ధానికి 7/12/2014 ఆదివారం మధ్యాహ్నం బయలుదేరి అదేసాయంత్రం తిరిగి వచ్చాక ఏర్పడిన ఈ భావోదయం ముప్పైగంటల తరువాత కూడా వెలుగుదారేమో అన్నట్టువుంది

IMG_1477.JPG

IMG_1479.JPG

IMG_1482.JPG

IMG_1485.JPG