నిజమైన పుణ్యక్షేత్రం!!


రాజహంసలు, గూడబాతులు, మంచు కొంగలు…పేరు ఏదైనా కాని సైబీరియా నుంచి వచ్చే పక్షులకు పుట్టింటి వారి వలె పురుడుపోసి తల్లీబడ్డల్ని అల్లుడినీ భద్రంగా సాగనంపే “పుణ్యక్షేత్రం” 5-8-2018 ఆదివారం నాడు మరోసారి దర్శనమైంది.

ఆహారమైన క్రిమి కీటకాలవేటలో రాత్రంతా షికార్లు చేసి పగటిపూట తల్లకిందులుగా వేలాడుతూ నిద్రపోయే గబ్బిలాలకు గూడై నిల్చిన “రాధేయపాలెం” చెట్టుని ఆవెంటనే దర్శించుకున్నాము. 

ఇదంతా రాజమండ్రికి 20 కిలోమీటర్లలోపు దూరంలోనే! గ్రేకలర్ ముక్కు, మచ్చలు వున్న తెల్లకొంగలు జంటలు జంటలుగా జూన్ జులై ఆగస్టునెలల్లో సైబీరియా నుంచివస్తాయి. పుల్లా, పుడకా ముక్కున కరచి, పదిలపరచుకుని, సురక్షితమైన స్ధావరాల్లో గూడుకట్టుకుంటాయి. గుడ్డుపెట్టిన కొంగ దాన్ని పొదిగి పిల్లను చేసే వరకూ మగకొంగ మేతను ఏరుకు వస్తుంది. పిల్లకు రెక్కలు బలపడి ఎగరడం నేర్చుకునే వరకూ తండ్రి కొంగ గూడులోనే వుండి పిల్లను కాపాడుకుంటుంది. తల్లికొంగ మేతను ఏరుకొచ్చి తండ్రీబిడ్డల కడుపునింపుతుంది. రెక్కలొచ్చిన బిడ్డలు, తల్లిదండ్రులూ డిసెంబర్ జనవరి నెలలలో వెళ్ళిపోతాయి.

కుటుంబ బాధ్యతల్లో పనివిభజనకు ఇంతకంటే మరొక రోల్ మోడల్ వుండదు.

చిన్నపాటి అలికిడికే బెదరిపోయే మూగజీవులు పుణ్యక్షేత్రం గ్రామం చెరువు చుట్టూ గట్టంతావున్న చెట్లనిండా సైబీరియానుంచి వచ్చే పక్షుల గూళ్ళు కట్టుకుంటున్నాయంటే ఈ ఊరి జనం మీద ఆ పక్షుల నమ్మకానికి భరోసాకి ఆశ్చర్యమనిపిస్తుంది. పక్షులను వేటాడే వారిని ఊరినుంచి పంపివేయడం పుణ్యక్షేత్రంలో తరతరాల సాంప్రదాయం. గుడ్లు పొదగడానికి సరైన శీతోష్ణాలు, పౌష్టికాహారాలు లభించడంతో పాటు వాటిని కాపాడుకునే ఊరి కట్టుబాటూ, పుణ్యక్షేత్రాన్ని సైబీరియా కొంగలకు పుట్టిల్లుగా మార్చేసింది.

ఇదంతా పత్రికలలో, టివిలలో చాలాసార్లు వచ్చింది. నేనుకూడా స్యూస్ ఫీచర్ గా ఈనాడులో, ఈటివిలో, జెమినిటివిలో ప్రెజెంట్ చేశాను. మోతుబరి బొప్పన బ్రహ్మాజీరావుగారు, డాక్టర్ గన్నిభాస్కరరావుగారితో కలిసి లోకసంచారం చేస్తున్నపుడు, ఆ గ్రామంలో డాక్టర్ గారికి ఇదంతా వివరించాను. ఆయన స్వయంగా ఫొటోలు తీశారు.

బ్రహ్మాజీ గారు గబ్బిలాల చెట్టుగురించి గురించి చెప్పగా చక్రద్వారబంధం రోడ్డులో వున్న రాధేయపాలెం దారిపట్టాము. ఊరికి ముందుగానే వున్న చెట్టుకి నల్లతోరణాలు వెలాడుతున్నట్టు నిద్రపోతున్న గబ్బిలాలు కనిపించాయి.

ఈ రెండు సన్నివేశాలలో పుణ్యక్షేత్రం, రాధేయపాలెం గ్రామాల వారి భూతదయ, జీవకారుణ్యం కనిపిస్తున్నాయి.

ఈ సంచారంలో – లోకమే శబ్ధసంగీతాల మయం అని నాకు అర్ధమైంది. దోమలు, తేనెటీగలు, వడ్రంగిపిట్టలు, చిలుకలు, పావురాలు, కాకులు, పక్షులు…నడిచే – పాకే – ఎగిరే క్రిమికీటకాలు, జీవుల పాటల్ని వినగలిగితే మన చెవులు, శరీరం, మనసూ ఆలకించగలదని అనుభవమైనట్టు కొన్ని క్షణాలు అనిపించింది.

కీటకాల, పక్షుల, పిట్టల ప్రతీ కదలిక, ఆట, వేట, ఒరిపిడి, రోదన, సంతోషం, ఆనందాల్లో ఒక లయవుంటుందని, ఆ లయ నుంచే సంగీతం పుట్టుకొచ్చిందని అర్ధమైంది.

జనంరొదలేని ప్రశాంతతలోనే లయ వినపడుతుంది. అది అబలలైన మూగజీవాలక ఆ లయే భరోసా ఇస్తుంది. ప్రకృతి తన సృష్టి ని తాను కాపాడుకోవడం ఇదే! రాధేయపాలెం, పుణ్యక్షేత్రాల మహిమ ఇదే!!

– పెద్దాడ నవీన్

ఇది మతాతీత విశ్వాసం! 


ఇది మతాతీత విశ్వాసం! 
ఇవాళ సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళినీ, మొన్న హైదరాబాద్ లో పెద్దమ్మ తల్లినీ చూశాము. 
జీవితాన్ని కలుషితం చేసుకున్న మనం…నైతికతను కోల్పోయిన మనుషులం…అసంతృప్తులను చల్లబరచుకోడానికో శూన్యాల్ని పూడ్చుకోడానికో మతాన్ని కౌగలించుకున్నాం…మనిషి ఉనికిని ఆధ్యాత్మికత ద్వారా సిద్ధాంతీకరించే ప్రయత్నం చేసే మతం మీద నాకు తృణీకారమైతే లేదుగాని, మతం మీదకంటే గ్రామ దేవతలంటేనే ప్రేమ గౌరవాలు వున్నాయి. 
పెద్దపెద్ద కళ్ళతో పసుపు పచ్చ శోభతో మూడడుగులు కూడా ఎత్తులేని ఈ పెద్దమ్మ, మహంకాళి తల్లులు ప్రజల నమ్మకాల్లో ఎవరెస్టుకి మించిన ఎత్తులో వున్నారు. 
జీవనవిధానంలో ఒకవిధమైన ప్రాకృతిక ధర్మాన్ని, నిరాడంబరతనీ, సొంత నైతికతనీ పాటించే మనిషి సాంఘిక స్వయంభువత్వమే మతాతీత విశ్వాసం. అక్కడ అన్నంలో బిరుసైన మొరటుతనం వున్నా, బలి ఇచ్చే కోడీ మేకా దున్నల చావు వాసన ఆవరించివున్నా ఏదో పవిత్రత అనుభూతిలోకి వస్తూనే వుంటుంది. 
జంగారెడ్డిగూడెం గంగానమ్మ జాతర, తాడువాయి వీరభద్రుడి తిరనాళ్ళ, నిడదవోలులో కొటసత్తెమ్మ మొక్కు, గోదావరి కుడి గట్టున గుబ్బలమంగమ్మ గుడి, రాజమండ్రిలో సోమాలమ్మ కాపలా, లోవలో తలుపులమ్మ తల్లిదయ…మతంతో నిమిత్తంలేని ఇన్ని జాతర్లు, మరెన్ని సంబరాలు నమ్మకానికీ, ఇచ్చిన మాట నిలబెట్టుకునే / మొక్కుతీర్చుకునే మనిషి నిబద్ధతకీ ఆనవాళ్ళు…అన్నిమతాలవారూ తీర్చుకునే మొక్కబళ్ళు
రాజమండి ఇస్కాన్ టెంపుల్ లో పరిమళాలు బాగుంటాయి. పాతసోమాలమ్మ గుడిలో కూర్చుంటే ఇది నాది అనిపిస్తుంది. కంచిమఠం లో గంభీర ప్రశాంతత కంటే అర్ధంకాని మంత్రాలు అతి తక్కువగా వుండే హైదరాబాద్ పెద్దమ్మ గుడిలో, సికిందరాబాద్ మహంకాళి గుడిలో…అసలు ఏగ్రామదేవతల గుడిలో అయినా మనుషుల అలికిడి అలజళ్ళే నచ్చుతాయి. 
మామూలు మనిషిని కాస్తదూరంగా వుంచే మతంకంటే, కష్టమొచ్చినపుడు చేయి పట్టుకున్నట్టు భరోసా ఇచ్చే మతాతీతమైన విశ్వాసమే నాకు ఇష్టంగా వుంటుంది.
మొక్కుకోవడానికి ఒకసారి, మొక్కు చెల్లించుకోడానికి మరోసారి జనులు తరలి వచ్చే యాత్రలో ఖర్చయ్యే ప్రతి రూపాయీ మన చుట్టూ వున్న ఎకనామిక్స్ ఎలా, ఎంతగా స్టిమ్యులేట్ చేస్తూందో గుడి చుట్టూ వున్న దుకాణాల్ని కాసేపు గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 

  

ఫీల్ గుడ్ అంటే ఇదేకదా! 


ఫీల్ గుడ్ అంటే ఇదేకదా! 

కోనల్ని వెతికి, కొండల్ని మొక్కి తెలియని చోటునుంచి ఒక అనుభవాన్ని తెంపుకువచ్చినట్టుంది. చూసిన ప్రతీదీ కొంచెంకొంచెంగానే ఆవిష్కారమైనట్టు వుంది. 
అనంత పద్మనాభస్వామి రూపంలో 1300 ఏళ్ళక్రితమే వెలిసిన నమ్మకానికి నాలుగువందల ఏళ్ళనాడే గుడికట్టించిన నిజాం మతాతీత లౌకికతత్వానికి గౌరవమేసింది.

మూసీనది పుట్టిన చోటుని చూడాలన్న ఉత్సాహంతో బయలుదేరాము. కానీ, ఎండలో రెండుమూడు కిలోమీటర్లు నడిచే సామర్ధ్యం చాలక నీరెండిపోయి పచ్చగడ్డి మొలిచిన రివర్ బెడ్ ని మాత్రం చూశాము. అక్కడున్నది వైష్ణవాలయం కాబట్టి సేవలు, తీర్ధప్రసాదాలు, దక్షిణలు పటాటోపంగానే వున్నాయి. వెళ్ళింది ఒకదారి, వచ్చింది మరోదారి. తారురోడ్లు బాగున్నాయి. చెట్లఎత్తు, సైజు ని బట్టి అనంతగిరి కొండమీద లోయలో వున్నవి మధ్యతరగతి అడవులు అయివుండాలనిపించింది. మెత్తటి కలప ఇచ్చే మానులు, పెళుసుగా విరిగే చిన్నవయసు చెట్లు ఎక్కువగా గనిపించాయి. 

జనావాసాల్లోకి ముందుగానే గ్రీష్మరుతువు చొరబడిపోయినా రుతుచక్రంలో ఇది ఆకులు చిగురించే వసంతరుతువే! ఈ శోభ అనంతగిరి మార్గంలో, పోయినవారం నాగార్జున సాగర్ వెళ్ళినపుడు ఆ అడవుల్లో కనిపించింది. 

నేలరాలి ఎండిపోతున్న ఆకుల పెళపెళలు చెప్పులు లేని పాదాలకు బాజాలతో స్వాగతం చెపుతున్నాయనిపించింది. పచ్చటి ఆకుల పసరువాసన కలగలసిన 
అడవిగాలిలో తెలియని పరిమళాలు ప్రయాణమంతటా గుండెను నింపుతూనే వున్నాయి. 

డబ్బుపెట్టి కొనుక్కునే సౌకర్యాలు సరే! ఇవి శరీరాన్ని కొంత సుఖంగా వుంచవచ్చు..కానీ, ఆనందం అనుభవమవ్వాల్సిందే. ఇది డబ్బుకి అందేదికారు. యాత్రలో కొంత ఆనందం దొరుకుతుంది. 

నింగి, నేల, నీరు, నిప్పు, గాలి కి దూరంగా కృత్రమత్వంతో గిడసబారిపోతున్న మనుషుల్లో పంచభూతాల ప్రాకృతిక రూపాలైన కొండలు, కోనలు, తీర్ధాలు ఒక మార్ధవాన్ని నింపుతాయి. 

ఫీల్ గుడ్ అంటే ఇదేకదా! 


మనిషి నీడకు దూరంగా వున్న ప్రకృతి ఏకాంత సౌందర్యం! 


చివరాదాకా వెల్లడికాని మూలమలుపులో ఉన్నట్టుండి తెరుచుకున్న ఒక అద్భుతం…కళ్ళు విప్పార్చుకోడానికి ఒక ఇంద్రజాలం…మనసు వికసించడానికి ఒక కొత్తదనం…పునరావృతంకాని కాలంలా, సుపరిచితం కాని స్ధలంలా, పునరుక్తి కాని భాషలా, ప్రతిధ్వనించని ధ్వనిలా, చర్విత చరణం కాని జీవితంలా ఒక వండర్ లాండ్ కాలికి తగిలింది. 

ఇది ఎత్తిపోతల జలపాతం
నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ దాటగానే గుంటూరు జిల్లా…మాచర్ల రోడ్డులో అక్కడికి 13 కిలోమీటర్ల దూరంలో ఎత్తిపోతల జలపాతముంది. గత ఆదివారం మా ఇద్దరు పిల్లలు, భార్య, నేనూ నాగార్జున సాగర్ వెళ్ళినపుడు ఈ జలపాతాన్ని కూడా చూశాము. కొండెక్కే గేటుదగ్గర కారు టోలు పదిరూపాయలు తీసుకున్నాడు. రశీదంటే మిమ్మల్నవరూ అడగరు పోండి అని భరోసాయిచ్చాడు. ఆ ఘాట్ లో ప్రతీ మలుపూ ఎదర ఏమి చూస్తామోనన్న కుతూహలమే! ఎండిపోతున్నట్టున్న అతి చిన్న చిన్న తుప్పలూ పొదలే…చిట్టడివి అనడం కూడా పెద్దమాటేనేమో!
అయితే అది నల్లమడ అడవి…మనిషి కలుషితం చేసిన అరణ్యపు అంచు…లోయలోకి వెళితే, అడవి లోకి చేరగలిగితే పులులు, ఏనుగలు ఏమోకాని అన్ని అడవి జంతువులూ తప్పక వుంటాయి. 
చేరవలసిన చోటుకి చేరాము. ఎంటె్రన్స్ టికెట్ ఇచ్చేదీ, గేటుముందు నిలుచుని టికెట్ ని స్వైప్ చేసేదీ ఒకే మనిషి. బస్సులో, షేర్ ఆటోల్లో అక్కడికి చేరి గుంపులు గుంపులుగా వేచి వున్న మనుషులు ”ఒక్కడే పాపం” అని సానుభూతి చూపినవారే తప్ప ఏంటీ నాన్సెన్స్ అని చిందులు తొక్కిన వారు. ఒక్కరూ కనబడలేదు.
మట్టిమనుషులకూ, నాగరీకులకూ అదే కదా తేడా!
టూరిజం రెస్టారెంటు, గెస్ట్ రూములు, టాయిలెట్ల కాంటా్రక్టర్ల అసలు చెప్పుకోకపోవడమే మంచిది. తాజ్ మహల్ ముందు తాజ్ మహల్ బొమ్మలు అమ్ముకునే వారు హెచ్చు ఆదాయాల మీదే దృష్టి పెట్టి వుంచుతారు. వారివి తాజ్ మహల్ ఔన్నత్యం గురించి ఆలోచించే తీరుబాటు జీవితాలు కావు. టూరిస్టు కేంద్రాల వద్ద ఏ వ్యాపారమైనా అంతే…
అది టూరిస్ట్ స్పాట్ కాబట్టి మల్టీనేషనల్ బ్రాండుల ఫుడ్ పేకెట్స్ అక్కడ చాలా వున్నాయి.అయితే మనుషులు మరీ ఇష్టారాజ్యంగా వుండకుండా కోతులు బాగానే కాపలా కాస్తున్నాయి. అడవంటే కోతుల ఆవాసమే. మనిషి పొడ సోకి వాటి పర్యావరణం దెబ్బతింది. అడవిలోకి వెళ్ళి ఆహారం సేకరించుకునే శ్రమను మరచి కేంటీనులోదూరి, మనుషుల చేతుల్లో వి లాక్కుని తినేసే గూండాయిజానికి పాల్పడుతున్నాయి.అయినా కూడా పోలీసులెవరూ లేకపోవడం మంచివిషయంగానే నాకుతోచింది.
తూర్పుకనుమలలో నల్లమల కొండలలో పుట్టిన చంద్రవంక నది ముటుకూరు అనే చోట పుట్టిందట చంద్రవంక నది. తుమృకోట అభయారణ్యాలలో కొండలపైనుంచి లోయలోకి దిగుతూ అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. పచ్చని కొండలమధ్యనుంచి సుమారు 70 అడుగుల ఎత్తునుంచి కిందకు దూకే చంద్రవంక నది లోయల్లో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. జలపాతాన్ని చూడడానికి వ్యూపాయింట్ ఉంది. అక్కడ నుంచి చంద్రవంక నది లోయలోకి దూకుతున్న దృశ్యాలు కనువిందు చేస్తే, ఆ నది వినిపించే గలగలలు వీనులవిందు చేస్తాయి. యతులు తపస్సు చేసుకునే ప్రశాంతమైన ప్రాంతం కాబట్టి యతి తపోతలము అనే పేరు క్రమంగా ఎత్తిపోతల అయిందని అంటారు. చీకటి పడకుండా అక్కడికి చేరుకోగలిగితే జలపాతం దూకే లోయ లోకి మెట్ల దారి ఉంది. అక్కడ దత్తాత్రేయస్వామి కోవెల దర్శించుకోవచ్చు. నది లోయలోకి దూకే చోట మొసళ్ళు వున్నట్టు బోర్డు హెచ్చరిస్తూంది. ఆ పక్కన సన్నటి నీటిపాయ ఉండి సమతల ప్రదేశం ఉంది కనుక పిల్లలు పెద్దలు నీళ్ళల్లో తడిసిపోవచ్చు.

అత్యంత కృత్రిమాలైన జలవిహార్ లూ, స్నోపార్కులూ, ఇవ్వలేని సహజమైన ఆనందాలను ఇలా…మనిషి నీడకు దూరంగా వున్న ప్రకృతి ఏకాంతాలే కదా  ప్రసాదించేవి!
కొన్నైనా పరిచయం లేని సంతోషాలే కదా మనిషిలో జీవశక్తిని ఉత్సాహపరచేవి!!

  
 

గోదావరి డెల్డా అంటే చిలవలు పలవలుగా పాకిన ఈనెల్ని అల్లుకున్న  పచ్చని ఆకు 


తూర్పుగోదావరిలో, కోనసీమలో, పశ్చిమగోదావరిలో ఏ కాల్వకింద ఊరుకి వెళ్ళవలసిన అవసరమో ఆలోచనో తట్టగానే చల్లగా పడవ ప్రయాణం మొదలుపెట్టేసినట్టువుంటుంది. పారేనీరూ, కదలని చెట్టూ పలకరిస్తున్నాయనిపిస్తుంది. 

బ్యారేజి మీద బస్సు వెళుతున్నపుడు అఖండ గోదావరి జలరాశి మీదుగా వీచే నైరుతిగాలి మొహాన్నితాకినపుడు, లోనికి చేరినపుడు ఏదో పట్టరాని సంతోషంలో ఉక్కిరి బిక్కిరౌతున్నట్టు వుంటుంది. సహ ప్రయాణికుల మాటల్లో హావభావాల్లో కష్టసుఖాలు వినబడినపుడు, కనబడినపుడు మనం జీవితంలోనే వున్నామన్న స్పృహ వస్తుంది. బొబ్బర్లంక కూడలిలో సిపిఎం సభల ప్రచారం పాటలో దరువు మోత హుషారెక్కించింది. ఆపక్కనే చొక్కా బొత్తాలూడిపోయి, పుల్లయిస్ చీకుతున్న  పిల్లాడి మొహంలో ప్రపంచాన్నే జయించిన తృప్తికనబడింది.

విజ్జేశ్వరంలో బస్ ఫుల్లు. కాసేపటికి కోడిపెంట వాసనరాగానే సమిశ్రగూడెం దగ్గరున్నామని అర్ధమైపోయింది. ఖాళీ అయిన కిటికీ పక్క సీటులో కూర్చుంటే కనబడే దృశ్యాల అందాన్ని హైడెఫినెషన్ కెమెరాలు కూడా చూపించలేవు. పదకొండో తేదీ సోమవారం నాడు డి ముప్పవరం, కానూరు, తీపర్రు, కాకరపర్రు, అజ్జరం, పెరవలి.., సాయం సంధ్య వేళ అదేదారిలో రాజమండ్రికి తిరుగు ప్రయాణం చేసినప్పటి ముచ్చట ఇది. 

కొత్తగా తారుపరచుకున్నరోడ్డు మీద మెత్తగా బస్సు వేగంగా పాకుతున్నపుడు ఇది కాటన్ దొర బృదం తిరిగిన కాల్వగట్టేనన్న జ్ఞాపకం ఆ మహనీయుణ్ణి మరోసారి స్పురణకు తెచ్చింది. నీరుపల్లమెరుగుననే ప్రాధమిక సూత్రంలో గ్రావిటేషన్ ఫోర్సుని పురుకూస వుండలు విసిరి వాలు కనిపెట్టి ఆమార్గంలోనే కాలువలు తవ్వించిన ‘నిత్యజీవితంలో భౌతిక శాస్త్రం’ టెక్నాలజీ మరోసారి అబ్బురమనిపించింది. 
పట్టని/నిండిన చోటునుంచి తొలగిపోడానికి నేలమీద నీరు ఏర్పరచుకున్న జాలు కాలక్రమంలో పశువులకు పుంతై, మనుషులకు దారై వర్షాకాలంలో పెద్ద అసౌకర్యమై, కాటన్ దొర చేతిలో గ్రావిటేషన్ కెనాలై, పర్యవేక్షణా నిర్వహణా యంత్రాంగాలకు రహదారులైన కాలక్రమంలో అందరికీ తార్రోడ్డయిన కాల్వగట్టు జీవిత చరిత్రగుర్తుకొచ్చింది. 


పొలాల పక్కనే టూవీలర్ మెకానిక్ షెడ్లు, మూడు చోట్ల సెకెండ్ హాండ్ కార్ల పార్కులు/సేల్సు పాయింట్లు చూస్తే జీవనశైలిలో యాంత్రిక సౌకర్యం కనిపిస్తూంది. ఆషెడ్ల చుట్టూ వున్న కొబ్బరాకు దడులు చూస్తే గోదావరి డెల్టా నేటివిటీ అర్ధమౌతుంది. 

ఒకో ఊరిలో  గుంపులు గుంపులుగా వీపున బరువైన బ్యాగులతో దిగే పలచటి కాలేజి అమ్మాయుల్ని చూస్తే  ఉచిత చదువు ఇచ్చిన ఎన్ టి ఆర్, వృత్తి విద్యాకోర్సులకు ఫీజు రీఎంబెర్స్ మెంటు ఇచ్చిన రాజశేఖరరెడ్డి గార్లమీద గౌరవమొచ్చింది. అబ్బాయిలు, అమ్మాయిల యూనీఫారాలు చూస్తే పూడ్చేసిన ప్రభుత్వ విద్యా సమాధుల మీద పూలకుండీల్లా అలంకరించిన ఆక్రమించుకున్న నారాయణ చైతన్య బ్రాండ్ల చదువులే తలపునకు వచ్చాయి. 

పంటకోసిన వరిచేలు పోలీసు అంటకత్తిరిలాగా, హైస్కూలు కుర్రాడికి తండ్రి చేయించిన సమ్మర్ క్రాఫులాగా వున్నాయి. 

పెళ్ళి ముచ్చట్లు, పలకరింపుల విషాదాలు, ఆస్పత్రి కష్టాలు, అప్పులతిప్పలు…ఇలాంటి ఈతి బాధలెన్నో అర్ధమైనట్టూ, అర్ధమవనట్టూ ప్రయాణికుల ముచ్చట్లలో వినబడుతూనే వున్నాయి.

కృష్ణా డెల్టా చూశాను, నాగార్జున సాగర్ కుడి ఎడమకాల్వల కింద ఊళ్ళు చూశాను. ప్రతీ ఇరిగేషన్ ప్రాజెక్టూ సిరిసంపదలను ఇచ్చేవే…అందుకు మూలాలైన పాడిపంటలు కృష్ణా, గోదావరి డెల్టాల్లో వున్నంత పదిలంగా దేశంలోనే ఎక్కడా లేవేమోనని నా అనుమానం. ఈ ప్రత్యేకత నైసర్గిక ఉనికి నుంచీ, నేల స్వభావం నుంచి వచ్చినవే. ఈ డెల్టాలు సముద్రతీరంనుంచి సగటున 70 కిలోమీటర్లలోపుదూరంలో, తీరానికి, నేషనల్ హైవేకీ మధ్యలో వున్నాయి. పంటకి అవసరంలేకపోయినా మాగాణుల్లో కాస్తయినా తీపినీరు లేకపోతే ఉప్పునీరు చేరి చేలు చౌడుబారిపోతాయి. నేల స్వభావం / సాయిల్ టెక్చర్ మారకుండా సహజ ప్రవాహాలే డెల్టాలను కాపాడుతున్నాయి. 

పట్టిసీమలో ఎత్తిపోతల పధకం వల్ల గోదావరి డెల్టాలో చివరి భూముల స్వభావం మారిపోతుంది. చౌడునేలలు మధ్యకంటా పాకిపోతాయి అని విజ్జేశ్వరంలో దిగిన రైతు పెరవలి సీతారామయ్యగారు వివరించారు. ఆయన తో సహా పశ్చిమగోదావరి జిల్లా వాళ్ళంతా ఏకపక్షంగా తెలుగుదేశాన్నే గెలిపించారు. అయితే ఈ సమస్యను ముఖ్య మంత్రికి చెప్పడానికి ఒక్కడంటే ఒక్కడు జిల్లా నాయకుడు కూడా లేడని ఆపెద్దాయన చాలా బాధపడ్డాడు. ఇది చెబుతున్నపుడు ఆయన కళ్ళలో దిగులుతడి మెరిసింది. 

పాలకులు గతులు తప్పుతున్నా, రుతువులన్నీ వేసవులౌతున్నా, పంట కేలెండర్లు మారిపొతున్నా మనుషులు,మనసుల ప్రకృతి తప్ప, ప్రకృతి ఆకృతి మారడం లేదు…మారదు.

నమ్రత తప్ప ఏమీతెలియని కాలువలు సాగిపోతూనే వున్నాయి. మనిషిలో మాలిన్యాన్ని గుండెలో దాచుకున్న తల్లిలా గోదావరి ప్రవహిస్తూనే వుంది. 
తాతలు గతించాకా వారి రూపులు వారసుల్లో వున్నట్టే, తరాలూ వేషభాషలు మారినా ఒక జాతి సంస్కృతీ సంప్రదాయాలు రూపాంతరమైనా  సజీవంగా కొనసాగుతూనే వుంటాయి. 

వీటన్నిటికీ మించి నీలిశూన్యంలో పరిమళాలు అల్లుతున్న గాలి నన్నుతాకడం గొప్ప అనుభవం…ఒక్కడినే అయిన నాలో వున్న నీటినీ,నేలనీ,గాలినీ,నిప్పునీ, ఆకాశాన్నీ…మూడుగదుల ఇల్లుదాటి స్వచ్ఛమైన ఒక ‘స్పేస్’లోకి రాగానే పంచభూతాలు పలకరించడమే నా ఆనందోద్వేగమనీ అనుభవయ్యింది.



జీవనవైవిధ్యాన్ని మింగేసిన కొండచిలువ(హైవే ప్రయాణం)



చెట్లనీ, చేలనీ, చెరువుల్నీ, పశువుల్నీ, వీటన్నిటి ఆలంబనగా సాగే జీవన వైవిధ్యాన్ని  మింగేసి పడుకున్న కొండచిలవలా వుంది నేషనల్ హై వే . అపార్టు మెంటులో పడుచుపిల్లలు భయపెట్టీ బతిమిలాడీ మాకూ, కారుకీ పులిమిన హోళీ రంగులతో ఒంగోలులో బంధువుల ఇంట పెళ్ళికి ప్రయాణం మొదలైంది. 

రాజమండ్రి నుంచి ప్రారంభమైన ప్రయాణంలో ఐదోనెంబరు జాతీయ రహదారికి రెండువైపులా పట్టణాలకు గ్రామాలకు దగ్గరగా వున్న పొలాల్లో పచ్చదనపు ఆచ్ఛాదన పోయి నేల నగ్నంగా మిగిలుంది. మట్టితోపాటు చెట్లనీ తవ్వేసి నాటిన ఇసుకా సిమెంటూ బిల్డింగులై మొలుస్తున్నాయి. వాటికి ఎరువు అన్నట్టు ఉరు చివర్లలో వాడి పారేసిన ప్లాస్టిక్ సంచులు భూమిమీద పొరలు పొరలుగా పేరుకుపోతున్నాయి. ఊళ్ళకు దూరంగా వున్న నేలమీద పైర్లు వున్నా పౌష్టికాహారంలేని సోమాలియా పిల్లల్లా గిడసబారిపోయినట్టున్నాయి. 
వాటి పచ్చదనంలో కళాకాంతులు లేవు. చమురు కాలిన పొగ ధూళి పంటల్ని కమ్ముకున్నట్టు వుంది.

దారిపొడవునా జీవన వైవిధ్యం కాక మూసపోసిన జీవితమే ఎదురైనట్ట అనిపించింది. 
ప్రయాణంలో రెండువేపులా పొలాలు, చెట్లు వుండేవి. పొలాల్లో క్రిమికీటకాలు తినే పక్షులు చెట్ల మీద కాపురముండేవి. పశువుల గాయాల్ని క్లీన్ చేసే పక్షుల్ని వాటికి దురదొస్తే గోకే పిట్టల్నీ చూశాం.సువిశాలమైన పొలాలు పాడైపోయి, పెద్దపెద్ద చెట్లు లేకుండాపోయాక ఆధారంలేక పశువుల పక్షులు ఈ మార్గంనుంచి ఎటో వెళ్ళిపోయాయి. 334 కిలోమీటర్ల (రాజమండ్రిలో మా ఇంటి నుంచి ఒంగోలులో మేము దిగిన హొటల్ వరకూ వున్న దూరం) ప్రయాణంలో రోడ్డు పక్కన ఒక్క పశువు కూడా కనిపించలేదు. పొలాల్లో రైతులు కనిపించలేదు. టోల్ గేట్ల వద్ద విసుగూ విరామంలేకుండా నిలువుకాళ్ళ జపంచేసే గుమాస్తాలగానో , గార్డులగానో వేరుశెనక్కాయలు అమ్ముకునే సర్వీసు సెక్టారులోకో రైతులూ రైతు కూలీలూ డంప్ అయిపోయారనే అర్ధమైంది. 

హైవేలో రెస్టారెంట్లు లేవు వున్నా బాగోవు కాబట్టి ఇంట్లో చేసి తెచ్చుకున్న పులిహోర ఏ చెట్టుకిందైనా తినొచ్చని అనుకున్నాము. ఎంతదూరానికీ చెట్టే లేకపోవడం వల్ల ఆకలిక పెరిగిపోయి కారు ఓ పక్కగా ఆపి లోపలే కూర్చుని కడుపు నింపుకున్నాము. ఆశోకుడు అనగానే ‘చెట్లు నాటించెను’ అనే ఎందుకు చెబుతారో రోడ్ల పక్కన చెట్ల అవసరం ఏమిటో అనుభవమయ్యింది. 

ఆకులు రాలే శశిరరుతువులో పచ్చదనం షేడ్స్ మార్చుకుంటూ ఆకు ఆరెంజ్ రంగులోకీ, కాండం బూడిద రంగులోకి మారుతాయి. ఆకాశంలో కూడా ఈ రంగులే వేర్వేరు షేడ్స్ లో కనిపిస్తాయి. ప్రకృతితో జీవనం ముడిపడివుండటం ఇదే. ఎంతదూరం చూసినా ‘తెల్ల’ మొహం వేసుకున్న ఆకాశం పేలవంగా కనిపించింది.

కారు నడపడం నాకు మీద ఆసక్తి పెరగడం బాగానే నడపడం, కాలి బొటన వేలు గాయపడిన స్ధితిలో కూడా నా చిన్న కొడుకు బాగా డ్రయివ్ చేయడం, నా భార్య ఆమె కజిన్ చెల్లి ఏకధాటికగా ఇతర కజిన్లనురించి చెడూ, మంచీ ముచ్చటించకోవడం, పెళ్ళి కొడుకు ఇంట్లో, వాడి పిన్ని ఇంట్లో మర్యాదగా మాతో తెగతినిపించేయడం కూడా హోళీనాడు నన్ను పులుముకున్న రంగులే! 


చేతులతో కాదు, చూపులతో పట్టుకోగలిగేదే అందం!


చేతులతో తాకగలిగేది మోహం కావచ్చేమోకాని, చూపులతో పట్టుకోగలిగేదే అందం…అందుకేనేమో నాకు ప్రయాణమంటే పట్టరాని సంబరం…ఎందుకంటే అందమైన అనుభూతులతో తిరిగిరావడం, ఏదో కొత్త జీవ చైతన్యాన్ని ఇంకింపచేసుకోవడం బయటకు వెళ్ళకపోతే కుదరవుకదా?

ద్రాక్షారామ లో వివాహనిశ్చితార్ధానికి తప్పక రావాలని జక్కంపూడి రాజా (దివంగత ప్రజానాయకుడు జక్కంపూడి రామమోహనరావుగారి పెద్దబ్బాయి రాజా ఇంద్ర వందిత్) స్వయంగా పిలిచినపుడే వెళ్ళాలని దాదాపుగా నిర్ణయించుకున్నాను. ఇతిహాసాలమీద మమకారం వల్లో ఏమో ద్రాక్షారామ’మంటేనే లోపల ఒక ఇష్టం మెదులుతుంది మరి.

శివుడి 18 మహా క్షేత్రాల్లో ద్రాక్షారామ ఒకటన్న నమ్మకం వయసు కనీసం 15 వందల సంవత్సరాలయితే, అప్పటి శిల్పకళా వైభవం తూర్పు చాళుక్యుల నాగరికతా, వికాసాలకు ఇప్పటికీ ప్రత్యక్షసాక్షిగా వుందన్న ఆలోచన బాగుంది. అప్పటి సమాజదృశ్యం ఎలా వుండేదో ఊహిద్దామంటే ఎలా ప్రారంభించాలో తట్టలేదు.

కారు కాకినాడ కాల్వరోడ్డులో ప్రయాణిస్తూండగా ‘నీరుపల్లమెరుగు’ అంటే మహాజ్ఞానమని అర్ధమైంది. తెలిసిన విషయాల్ని అన్వయించుకుని జీవితాలను సఫలం చేసుకోవడమే జ్ఞానం. అనుకూల పరిస్ధితులను వెతుక్కుంటూ వలసలో జైత్రయాత్రలో చేసిన వివేకవంతులైన సాహసులవల్లే జాతులు విస్తరించాయి.వికసించాయి. అలా గోదావరి తూర్పుగట్టున తూర్పు చాళుక్యులు కనిపెట్టిన ద్రాక్షారామ కు వెళుతున్నామన్న భావన మరోసారి ఉత్సుకతను రేపింది.

పట్టని/నిండిన చోటునుంచి తొలగిపోడానికి నేలమీద నీరు ఏర్పరచుకున్న జాలు కాలక్రమంలో పశువులకు పుంతై, మనుషులకు దారై వర్షాకాలంలో పెద్ద అసౌకర్యమై, కాటన్ దొర చేతిలో గ్రావిటేషన్ కెనాలై, పర్యవేక్షణా నిర్వహణా యంత్రాంగాలకు రహదారులైన కాలక్రమంలో అందరికీ తార్రోడ్డయిన కాల్వగట్టు మీద గన్నికృష్ణ గారి కారులో ప్రయాణం హుషారనిపించింది.ఆయన అనుచరులు బాలనాగేశ్వరరావు, వెంకటరాజు గార్లు కూడా ఈ ప్రయాణంలో వున్నారు.

నీళ్ళు పచ్చని చెట్లు చాలాచోట్ల కోతలైపోయిన చేలు, ఇటుకల బట్టీలు, కలప అడితులు…దారిపొడవునా ఇవేదృశ్యాలు

నిశ్చితార్ధ వేదిక తూర్పుగోదావరి జిల్లా లో అతిముఖ్యుల తో కిక్కిరిసిపోయింది. రాజాను కలిసి అభినందించి తిరుగుప్రయాణం కాగానే వీరిభోజనాల సంగతి చూడాలని ఒకర్ని పురమాయించారు. మొగమాట పడకండి ‘మాటొచ్చేద్ది’అని ఇంకో పెద్దమనిషి హెచ్చరించారు. ఈజిల్లా యాస, తినకుండా వెళ్ళనిచ్చేదిలేదన్న కటువైన అభిమానం మాటొచ్చేద్ది అనేమాటలో వున్నాయి.

ద్రాక్షారామలో గొప్ప పాకశాస్త్ర ప్రవీణులున్నారు. మాంసాహార వంటకాల్లో వీరి ఖ్యాతి రాష్ట్రమంతటికీ పాకింది. నేను కేవలం శాఖాహారినే. ఏ ఆహారమైనా సరే వంటవారు తమ ప్రతిభను చాటుకోడానికో అత్యుత్సాహంవల్లో రుచులను కలగాపులగంచేసి వంటలు పాడుచేయడం పెరిగిపోతోందన్నది నా అభియోగం. అయితే ఈ వంటలో రుచులను యధాతధంగా వుంచి పండించారు. మొత్తం ఏంబియన్స్ కోసం స్ధానికంగా వున్న వనరులనే తప్ప బయటి వాటిని తెప్పించకపోవడం ఒక విశేషం. గ్రామీణ స్త్రీలలో మేకప్/మేకోవర్ , గ్రామీణ పురుషులలో ఖరీదుల్ని చూపుకోవాలన్న సృ్పహలు బాగా పెరిగాయని వందలమంది హాజరైన ఈ వేడుకలో అర్ధమైంది.

మధ్యతరగతి వర్గాల కొనుగోలు శక్తులు పెరగి కార్లు పెరగడం వల్ల కూడా రామచంద్రాపురం డివిజన్ లో సింగిల్ రోడ్లు ఇరుకై టా్రఫిక్ జాములు తప్పడంలేదు. రోడ్డు వైడనింగ్ కూడా అక్కడక్కడా జరుగుతూనే వుంది.

రామచంద్రాపురంలో గమ్మత్తయిన రుచితో కిళ్ళీలు చుట్టే శ్రీరాజాపాన్ షాప్ ఏసీనూలేనంత నిరాడంబరంగావుంది. ఊరినే పేరులో ఇముడ్చుకున్న తాపేశ్వరం కాజా దొరికే ‘సురుచి’ వ్యాపార వైభవం దాయాదిపోరులో ఏనాడో జయించింది.

వీటన్నిటికీ మించి నీలిశూన్యంలో పరిమళాలు అల్లుతున్న గాలి నన్నుతాకడం గొప్ప అనుభవం…ఒక్కడినే అయిన నాలో వున్న నీటినీ,నేలనీ,గాలినీ,నిప్పునీ, ఆకాశాన్నీ…మూడుగదుల ఇల్లుదాటి స్వచ్ఛమైన ఒక ‘స్పేస్’లోకి రాగానే పంచభూతాలు పలకరించడమే నా ఆనందోద్వేగమనీ అనుభవయ్యింది.

రాజా పెళ్ళినిశ్చితార్ధానికి 7/12/2014 ఆదివారం మధ్యాహ్నం బయలుదేరి అదేసాయంత్రం తిరిగి వచ్చాక ఏర్పడిన ఈ భావోదయం ముప్పైగంటల తరువాత కూడా వెలుగుదారేమో అన్నట్టువుంది

IMG_1477.JPG

IMG_1479.JPG

IMG_1482.JPG

IMG_1485.JPG