తూర్పుగోదావరి జిల్లాలో 11నియోజకవర్గాల్లో 16 మండలాలు, 2మున్సిపల్ కారొ్పరేషన్లు, 3మున్సిపాలిటీలు, 78గ్రామాల మీదుగా 23 రోజులపాటు 247 కిలో మీటర్లు నడచిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సొంత పార్టీలో అపూర్వమైన ఉత్తేజాన్ని నింపారు. పార్టీ కార్యకర్తల సమస్యల్ని నియోజకవర్గాల వారీగా విన్నారు. వందలాది మందిని పేరుపెట్టి పలకరించి కార్యకర్తలే పార్టీకి ప్రాణసమానులన్న సంకేతం ఇచ్చారు. ది్వతీయశ్రేణి కార్యకర్తలకు గుర్తింపు గౌరవాలను తెచ్చారు. పార్టీలో ప్రజాభిమానానికీ, అంకితమైన కార్యకర్తలకూ లోటులేక పోయినప్పటికీ నాయకులతోనే సమస్యలున్నాయన్న ఫిర్యాదులను దాదాపు ప్రతీ నియోజకవర్గ సమావేశంలోనూ విన్నారు. పరిస్ధితిని చక్కదిద్దుతామని భరోసాయిచ్చారు. నాయకత్వానికి కార్యకర్తలకూ మధ్య అగాధాన్ని అర్ధం చేసుకోడానికి ఈ యాత్ర బాబుకి ఉపయోగపడింది


పాదయాత్ర చంద్రబాబుకి కూడా గొప్ప అనుభవాన్నిచ్చింది. అతిసామాన్య ప్రజల వద్దకే వెళ్ళి నేరుగా మాట్లాడటం వల్ల వాళ్ళ జీవితాల్ని ప్రత్యక్షంగా అర్ధంచేసుకోడానికీ అనుభూతి చెందడానికీ అవకాశమొచ్చింది.

అయితే జిల్లానుంచి పక్కజిల్లా విశాఖ లోకి ప్రవేశించే ముందు తూర్పుగోదావరి సమస్యల పరిష్కారానికి ఆయన ప్రకటించిన డిక్లరేషన్ అమలు చేయడానికి ఎన్ని వేల కోట్ల రూపాయల అవసరమౌతాయో లెఖ్ఖ చేసినట్టు లేదు. ఈ తరహా హామీలు నాయకుడి మీద పుట్టుకొచ్చిన ఆసక్తి కుతూహలాలను సహజంగానే చంపేస్తాయి. ప్రజా సమస్యలను అర్ధం చేసుకోడానికన్న ఈ యాత్ర ఎన్నికలప్రచారానికేనన్న భావనే విరివిగా వ్యాపిస్తూంది.

యాత్రలో మహిళలు పెద్దగా కనిపించలేదు. కాపులు దూరంగా నే వున్నారు. ఎస్ సిలలో అత్యధిక సంఖ్యాకులైన మాలలు దూరంగావుండగా మాదిగలు తెలుగుదేశం పట్ల సానుభూతితోవున్నట్టు అర్ధమౌతోంది

చంద్రబాబు మొదటసారి 18 ఏళ్ళక్రితం ముఖ్యమంత్రిఅయ్యారు. అప్పుడు, అంతకుముందు ఓ పదేళ్ళ క్రితం పుట్టిన వారు అంటే ఇపుడు 25 నుంచి 30 ఏళ్ళ వయసువారిమీద తెలుగుదేశం ముద్ర, చంద్రబాబు ముద్రలేదు. ఆవయసు గ్రూపు వారు చంద్రబాబు పర్యటనలో పెద్దగా కనిపించకపోవడాన్ని బట్టి యువకులు తెలుగుదేశం వైపు అంతగా లేరా అన్న అనుమానం కలుగుతోంది. ఈ గ్యాప్ ను బిజినస్ ప్రొఫెషనల్ యువకుడు, చంద్రబాబు కొడుకు నారా లోకేష్ భర్తీ చేయగలరా?

కాగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు కాకరాపల్లిలో చంద్రబాబు తుని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు జిల్లా పర్యటన పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక డిక్లరేషన్ ప్రకటించారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే పోలవరానికి జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. గోదావరి ప్రాంతంలో రెండు పంటలకు సాగు నీరు అందించడంతో పాటు ఏలేరు ఆధునీకీకరణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పుష్కర, చాగల్నాడు పధకాలను పూర్తి చేస్తామని, గోదావరి డెల్టాను ఆధునీకీకరిస్తామని హామీ ఇచ్చారు. కాకినాడ-రాజమండ్రి ప్రాంతాన్ని వ్యవసాయ ఆధారిత కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఐటి రంగంలో ఈ రెండు నగరాలను అభివృద్ధి చేస్తామన్నారు.

కేజి బేసిన్ ద్వారా ఇంటింటికి వంట గ్యాస్ను పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తామని చెప్పారు. జిల్లాలో కడియం నర్సరీలను టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని, కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్ను నిర్మిస్తామని చెప్పారు. కాకినాడ నుండి విశాఖపట్నం వరకు ఆరు లైన్ల రహదారిని అభివృద్ధి చేస్తామని, కత్తిపూడి నుండి కృష్ణా జిల్లా పామర్రు వరకు 214 నెంబర్ జాతీయ రహదారిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాకినాడ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించి యాంకరేజ్ పోర్టును అభివృద్ధి చేస్తామన్నారు. అమలాపురంలో కోకోనెట్ బోర్డు ఏర్పాటు చేసి కొబ్బరి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతామని చెప్పారు. జిల్లాలో సహజ వనరులను అభివృద్ధి చేసి స్థానిక నిరుద్యోగులకు స్థానికంగానే ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని తెలియజేశారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

అంతకు ముందు ఉదయం 10 గంటలకు చంద్రబాబుకు హైదరాబాద్ నుండి వచ్చిన డాక్టర్ రాకేష్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబు కాలి నొప్పితో బాధపడుతుండడంతో ఆయనకు విశ్రాంతి అవసరమని పాదయాత్రను నిలిపివేయాలంటూ వైద్యులు సూచించారు. అయినప్పటకీ చంద్రబాబు పాదయాత్రను కొనసాగించాలనే నిర్ణయించారు. అయితే షెడ్యూల్ ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రను పూర్తి చేసి విశాఖ జిల్లాలో మాత్రం యాత్రకు రెండు రోజులు విరామం ప్రకటించారు. శుక్రవారం రాత్రికే విశాఖ జిల్లాకు చేరుకున్న బాబు శృంగవరం వరకు పాదయాత్ర నిర్వహించి రాత్రి అక్కడే బస చేశారు. ఈ శని, ఆదివారాల్లో పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఈ నెల 17వ తేదీ నుండి చంద్రబాబు యధావిధిగా విశాఖ జిల్లాలో పర్యటిస్తారని పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు చెప్పారు.