రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో పెల్లుబికిన ఆగ్రహం ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెంది దశాదిశా తోచక కార్యక్రమంలేక పలచబడిపోతూండగా రాజకీయపార్టీలు ఈ స్ధితిని సొమ్ముచేసుకునే పనికే తెగబడుతున్నాయి. 
ఇలాతంటాలు పడటలో  వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండగా ఇబ్బంది పడుతూనే తెలుగుదేశం దాన్ని అనుసరిస్తున్నట్టుంది. ఎక్కడో దాచుకున్న ముఖాలను ప్రజలముందు ఎలాబయటపెట్టాలో దారితోచక కాంగ్రెస్ వాళ్ళు ఈ వెంపర్లాటలో వెనకబడిపోయారు
రాజకీయ పార్టీల మద్య వత్తిడి పోటీలను చాలా తీవ్రంగా ఈ స్ధితిలో పైకి మాత్రం సమైక్యవాదన వినిపిస్తున్నా అసలు ప్రయత్నమంతా ప్రజలలో రేకెత్తిన సమైక్య భావనను ఎవరికి వారు తమకు అనుకూలంగా మలచుకోవడమే .అందులో ప్రధాన పాత్రను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ,టిడిపిలు పోషిస్తుండగా, కాంగ్రెస్ నేతలు కూడా శక్తి వంచన లేకుండా తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
సమైక్య రాష్ట్రం కోరుతూ ఇంతగా ప్రజలలో మనోభావాలు వ్యక్తం అవుతాయని మొదట రాజకీయ పార్టీలు ఊహించలేదు. మంత్రి టిజి వెంకటేష్ ఒక సందర్భంలో ప్రజలు రోడ్లమీదకు రాకపోతే తాము రాష్ట్ర సమైక్యత గురించి ఎలా వాదిస్తామని చేసిన వ్యాఖ్య ఇందుకు నిదర్శనంగా ఉంటుంది.అయితే క్రమేపి ఉద్యమం పుంజుకుని ఇప్పుడు సర్వం బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది.కొంతకాలం క్రితం కడపలో సమైక్యాంధ్ర జెఎసి సమావేశంలో రాజీనామాల పర్వం ఆరంభమైంది. ఆ తర్వాత సీరియస్ గా కడప జిల్లాకే చెందిన ఎమ్మెల్యే వీరశివారెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.దాంతో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా (విజయమ్మ తప్ప) రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.దాంతో కొందరు టిడిపి ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.ఆ తర్వాత జూలై ముప్పైన తెలంగాణ ప్రకటనను కాంగ్రెస్ చేసింది.
దాంతో పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి.సీమాంధ్ర మంత్రులు వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.టిడిపి అదినేత చంద్రబాబు కొంత సంయమనం పాటించి విభజనకు అనుకూలంగా మాట్లాడి కొత్త రాజధానికి నాలుగైదు లక్షల కోట్లు ఇవ్వాలని సూచించారు.
ఆ తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏకంగా సిడబ్ల్యుసి తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించడంతో కాంగ్రెస్ కు సీమాంద్రలో కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చింది. ఆ తరుణంలో చంద్రబాబు నాయుడు తన వైఖరిలో కొంత మార్పు చేసుకుని ప్రధానికి ఒక లేఖ రాస్తూ విభజన సందర్భంగా సీమాంద్ర ప్రయోజనాలు కాపాడడానికి ప్రయత్నించలేదని విమర్శించారు.అందులో కేంద్రాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.కిరణ్,చంద్రబాబుల వ్యూహాన్ని తిప్పికొట్టడానికిగాను విజయమ్మ ఎమ్మెల్యే పదవికి, జగన్ ఎమ్.పి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ఒక బహిరంగ లేఖ రాశారు.అందులో సవాలక్ష సమస్యలను ప్రస్తావించి సమైక్యవాదానికి దాదాపు దగ్గరగా వెళ్లిపోయారు. దానిపై చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించి కేంద్రంపై,కాంగ్రెస్ ఐ ఘాటుగా ధ్వజమెత్తి తెలుగుదేశం ను దెబ్బతీయడానికే తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టారని విమర్శించారు.అంతేకాక చంద్రబాబు స్వయంగా ఆయా వర్గాల వారితో చర్చలు ఆరంభిస్తున్నట్లు ప్రకటించారు.
ఇక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకు వేసి విజయమ్మ ఆమరణ దీక్ష ప్రకటించారు.రాష్ట్ర సమైక్యం కోసం ఆమె దీక్షకు దిగుతున్నారు.ఈ వార్త విన్నామో,లేదో టిడిపి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూడా దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు.రెండువేల తొమ్మిది డిసెంబరులో కూడా సీమాంధ్ర అంతటా అనేకమంది నాయకులు పార్టీలకు అతీతంగా ఆమరణ దీక్షలకు దిగారు.అప్పుడు కంటే ఇప్పుడు పోటాపోటీ వాతావరణం ఏర్పడింది.ఎన్నికల ముందు జనంలో తమ ముద్ర వేసుకోవడానికి ఆయా పక్షాలు తీవ్రంగా యత్నిస్తున్నాయని భావించవచ్చు.
ఇక పార్లమెంటులో కూడా కాంగ్రెస్,టిడిపి ఎమ్.పిలు పోటాపోటీ ఆందోళనలకు దిగుతున్నారు.ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్నారు.కేంద్రంలోని సీమాంధ్ర మంత్రులు ఆందోళనలలో స్వయంగా పాల్గొనడం లేదు కాని, రాస్ట్రంలోని సీమాంధ్ర మంత్రులు ఆందోళనలలో కూడా పాల్గొంటున్నారు.సీమాంధ్రలో తమ భవిష్యత్తు ఏమిటో తెలియని పరిస్థితిలో వీరు తమ ప్రయత్నం తాము చేస్తున్నారు.వైఎస్.ఆర్.కాంగ్రెస్,టిడిపిలు మాత్రం సీమాంద్రలో సమైక్యబాణితో పోటాపోటీ రాజకీయానికి సిద్దపడుతున్నాయని అనుకోవచ్చు.
కాంగ్రెస్ అధిష్టానం నయానా భయానా దారికి తెచ్చుకుంటన్న ఒత్తిడితో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు వెనక్కి తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.