మనిషి ముగ్దుడైపోవటం అనుభవమయ్యింది! 


మనిషి ముగ్దుడైపోవటం అనుభవమయ్యింది! 

ఇరవైరెండు లక్షల ఎకరాల్లో నిత్య దుర్భిక్షాన్ని పచ్చటి బతుకుగా మార్చడానికి నందికొండలోయలో నీటి చెలిమై ఆగిన కృష్ణమ్మను చూశాక ఒక కృతజ్ఞతతో మనసు పొంగినట్టు అనిపించింది. 

నాగార్జునసాగర్ ప్రాజెక్టుని ముప్పైఏళ్ళక్రితం పుట్టిన ఆశ నిన్నతీరింది. ప్రాజెక్టు ఎడమకాల్వ కింద గుంటూరు ప్రకాశం జిల్లాలో చివరి భూములకు నీరందని అవకతవకలపై 1982 లో చీఫ్ ఇంజనీరు శ్రీనివాసరావుగారు విచారణ చేయగా నేనూ ఫాలో అయ్యాను. చాలావార్తలు రాశాను. ఎంక్వయిరీ రిపోర్టులో ఆ వార్తల్ని కూడా ఉటంకించారు. అసెంబ్లీలో పెద్ద దుమారమైంది. 27 మంది ఇరిగేషన్ ఇంజనీర్లు సస్పెండయ్యారు. ఆ సమయంలోనే సాగర్ ప్రాజెక్టుని చూడాలనిపించింది. అది ఇప్పటికి నెరవేరింది. 

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మక్తా్యల రాజాగారు, ఖోస్లాగారు చేసిన కృషిగురించి చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరావుగారు చెప్పిన మాటలు చెవిలో వినిపిస్తున్నట్టే వున్నాయి. 

కృష్ణనీ పెన్ననీ కలిపి తమిళనాడు తరలింకుచుకు పోవాలని ప్రతిపాదించింది.నిజాం నవాబు తన రాజ్యంలోనే కష్ణపై ఆనకట్ట కట్టించే అవకాశాల్ని అధ్యయనం చేయించినపుడు నల్గొండజిల్లా నందికొండ అనువైనదని తేలింది. ఆనివేదికతో మక్తా్యల రాజాగారు ముందడుగువేసి స్వయంగా ఊరూరూ తిరిగి ప్రజల సంతకాలతో ప్రాజెక్టు డిమాండును ప్రభుత్వం ముందుంచారు. సొంత డబ్బు జీలాలిచ్చి సర్వే చేయించారు. ఇష్టం లేని మద్రాసు ప్రభుత్వం కాలయాపన ఉద్దేశ్యంతో ఖోస్లా కమిటీని వేసింది. దారీ డొంకాలేని నందికొండకు వెళ్ళెదెలా? ఏమీ చూడకుండానే పా్రజెక్టుని ఆమోదించేదెలా అని ఖోస్లా ప్రశ్నించినపుడు, రాజాగారు 25 గ్రామాల ప్రజల్ని కూడగట్టి రేయింబవళ్ళు శ్రమదానం చేయించి కచ్చారోడ్లు వేయించారు. ఖోస్లా కమిటీ నందికొండను చూసి ప్రాజెక్టు నిర్మాణానికి ఇంతకు మించిన చోటు వుండదనీ, ఇది దేవుడు మీకిచ్చిన గొప్పవరమనీ అన్నారట. ఆవిధంగా మంజూరైన ప్రాజెక్టుకి 1955 లో నెహ్రూగారు శంకుస్ధాపన చేశారు. 1969 లో నిర్మాణం పూర్తయింది. 

వేసవికనున ఇరవై ఆరు గేట్లూ మూసివున్న డ్యాము ఎత్తుని గంభీరతనీ చూస్తే సృష్టిలో చైతన్యానికి మనిషికి మించిన రూపం ఇంకేముందని వెంటు్రకలు నిక్కబొడుచుకుంటున్నట్టు వుంటుంది. జీవనదిని ఆపిన మనిషి మేధస్సుకి సముద్రంలోతైనా అందుతుందా అని అబ్బురమనిపిస్తుంది. ప్రకృతికి అర్ధంచేసుకుని సాగే మనిషి ప్రయాణం ఎప్పటికీ ఆగదని నిబ్బరమొస్తుంది. ప్రాజెక్టిని ప్రజలకిచ్చిన రాజాగారు, నిజాంగారు, నెహ్రూగారు, కెఎల్ రావుగారు ప్రొఫెసర్ ఎన్.జి.రంగా గారు, మోటూరు హనుమంతరావుగారు,  కొత్త రఘురామయ్యగారు మొదలైన మహాను భావుల పట్ల కృతజ్ఞతతో హృదయంలో చెమ్మగిల్లుతుంది. 

ప్రాజెక్టు దిగువ నదీగర్భంలో బండరాళ్ళు, ఎండు నేలా – మాయావుల పట్ల కృష్ణమ్మ ఆగ్రహంలా వున్నాయి. గ్రీష్మరుతువు ఇంతే కఠినమని గుర్తు చేస్తున్నట్టున్నాయి. 
అయినా, కరువుతో గుండె చెరువైనవారిని చూసి ఆతల్లి కరిగిపోతుంది. ఎండిన నేలనొకసారి పలకరించి, మనిషి, మేక, పశువూ తేడా లేకుండా నోరెండిన ప్రతిప్రాణి గొంతూ తడుపుతుంది.

మరి, కృష్ణవేణంటే నీరుకదా! నీరంటే అమ్మ కదా!!
%d bloggers like this: